ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భక్తుల ప్రయాణ సౌలభ్యం కోసం తిరుపతి – పళని బస్సు సేవను ప్రారంభించారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పవన్ కల్యాణ్ బస్సు సేవను ప్రారంభించగా, మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, ఎండీ ద్వారకా తిరుమలరావు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం, వేదపండితుల ఆశీర్వాదం పొందారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, పళని ఆలయాన్ని సందర్శించినప్పుడు భక్తులు తిరుపతి నుంచి పళని వరకు ప్రత్యక్ష బస్సు అవసరమని కోరారు. వారి విజ్ఞప్తిని సీఎం చంద్రబాబు వద్దకు తీసుకెళ్లగానే ఆయన వెంటనే ఆమోదం తెలిపారని వివరించారు. భక్తుల కోరికను తాము ప్రాధాన్యతగా పరిగణించి, ఈ సేవను ప్రారంభించామని తెలిపారు.
కొత్త బస్సు సర్వీస్‌తో ప్రయాణ సమయం తగ్గుతుందని, భక్తులు మధ్యలో ఇతర ఆలయాలను కూడా సందర్శించుకోవడానికి అవకాశం ఉంటుందని పవన్ కల్యాణ్ తెలిపారు. పళని వాసులు, తిరుపతి భక్తులు ఈ బస్సు కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారని, వారి అవసరాలను అర్థం చేసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. ఈ సర్వీసు ప్రారంభానికి సహకరించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల ప్రయోజనాల కోసం మరిన్ని సేవలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.