Pawan Kalyan: ఏపీలో నెల్లూరు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఘర్షణలకు దారితీసింది. ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రశాంతిరెడ్డి వర్గీయులతో పాటు టీడీపీ క్యాడర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరిచేలా మాట్లాడటం సరైన పద్థతి కాదని హెచ్చరించారు. మహిళల వ్యక్తిగత జీవితాలపై అభ్యంతకరమైన వ్యాఖ్యలు చేయడం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని మండిపడ్డారు.
మహిళా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవని ధ్వజమెత్తారు. వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుంటారా అని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్య వాదులంతా ఈ వ్యాఖ్యలను ఖండించాలని పిలుపునిచ్చారు. గతంలో అసెంబ్లీలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకే ప్రజలు ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పారని..అయినా కానీ వైసీపీ నేతల్లో మార్పు రావడం లేదన్నారు. మహిళాల గౌరవానికి భంగం కలిగించేలా ఇలాగే ప్రవర్తిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైసీపీ నేతల తీరు ఇలాగే ఉంటే మహిళ సమాజం మరోసారి ఆ పార్టీకి తగిన విధంగా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉందన్నారు.
కాగా ఇటీవల వైసీపీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. ప్రశాంతి రెడ్డి వ్యక్తిగత జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె క్యారెక్టర్ దెబ్బతినేలా వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో ఫర్నిచర్, కార్లు ధ్వంసం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ దాడులకు తనకు ఎలాంటి సంబంధం లేదని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు.
Also Read: మళ్ళీ క్షీణించిన వల్లభనేని వంశీ ఆరోగ్యం
ఇప్పటికే తన వ్యక్తిగత జీవితంపై అనేక సార్లు తీవ్ర విమర్శలు చేసినా తానెప్పుడూ సహనం కోల్పోలేదన్నారు. ఇప్పుడు మళ్లీ తనపై అసభ్యకరంగా మాట్లాడటాన్ని జీర్ణించుకోలేక అభిమానులు దాడి చేశారేమో తనకు తెలియదన్నారు. తన క్యారెక్టర్‌పై విమర్శలు చేసిన ప్రసన్నకుమార్ రెడ్డిపై మహిళా కమిషన్‌కి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. మరోసారి మహిళలపై అసభ్యకరంగా మాట్లాడాలంటే వైసీపీ నేతలు భయపడేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరతానని ఆమె వెల్లడించారు.


