AP Free Busses for Women: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం మరో 5 రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన మొత్తం బస్సుల్లో.. 74 శాతం బస్సుల్లో ఈ పథకం వర్తిస్తుంది. అంటే సంస్థలో మొత్తంగా 11,449 బస్సులు ఉండగా.. వీటిలో ఉచిత ప్రయాణం అమలు కానున్న ఐదు రకాల బస్సుల సంఖ్య 8,458. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగస్టు 15న ఈ పథకాన్ని మంగళగిరిలో ప్రారంభించే అవకాశం ఉంది. ఉదయం స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని, మధ్యాహ్నం తర్వాత ఈ ఫ్రీ బస్ పథకాన్ని ప్రారంభిస్తారని సమాచారం.
ఇంటర్‌స్టేట్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులుగా రాష్ట్రం నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాలకు తిరిగే బస్సులో ఉచిత ప్రయాణం ఉండదని తెలుస్తోంది. ఇంకా తిరుమల, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఘాట్లలో ప్రయాణించే ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం అమలు చేయరని సమాచారం. ఎందుంటే ఈ ప్రాంతాల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తే.. ఆ బస్సుల్లో రద్దీ ఎక్కువై, ఘాట్‌లో నడపటం కష్టమవుతుందని అనుకుంటున్నారు. నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం ఉండదు.
ఎంత నష్టం అంటే..
మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం కారణంగా బస్సుల్లో పురుష ప్రయాణికులు తగ్గే ఛాన్స్ ఉందని అధికారుల అంచనా. ప్రస్తుత ప్రయాణికుల్లో 60 శాతం పురుషులు, 40 శాతం మహిళలు ఉంటున్నారు. ఉచిత ప్రయాణ పథకం అమలుతో.. ఐదు రకాల బస్సుల్లో పురుషుల సంఖ్య 33 శాతానికి తగ్గి, మహిళల సంఖ్య 67 శాతానికి పెరుగుతుందని తెలుస్తోంది. పురుష ప్రయాణికులు తగ్గడం వల్ల ఆర్టీసీకి ఏడాదికి రూ.288 కోట్లు రాబడి తగ్గుతుందని అంచనా. మహిళా ప్రయాణికులకు అయ్యే ఛార్జీలు ఏడాదికి రూ.1,453 కోట్లుగా ఉండొచ్చు. అంటే ఈ ఉచిత ప్రయాణ పథకం అమలుతో నిర్వహణ ఖర్చులు అదనంగా రూ.201 కోట్ల వరకు పెరగనున్నాయి. మొత్తంగా కొత్త పథకం వల్ల ఆర్టీసీపై నెలకు దాదాపు రూ.162 కోట్ల చొప్పున ఏడాదికి రూ.1,942 కోట్ల భారం పడనుందని సమాచారం.


