AP High Court| వైసీపీ ప్రభుత్వంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ విజయ్ బాబు(Journalist Vijaybabu)పై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నారంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం మండిపడింది. రాజకీయ దురుద్దేశంతోనే పిటిషన్ వేశారంటూ సీరియస్ అయింది.
ఈ పిటిషన్ ద్వారా ప్రజాప్రయోజన వ్యాజ్యం ఉద్దేశాలను విస్మరించాలని వ్యాఖ్యానించింది. అసలు తమ హక్కులు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో పోస్టులు ఎలా పెడతారని ప్రశ్నించింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు ఖరీదైన ఫోన్లు, ఎలక్ట్రానిక్ డివైజ్‌లు వాడుతున్నారని.. ఇలాంటి వారి తరఫున పిల్ వేయాల్సిన అవసరమేమిటని ప్రశ్నించింది.
సోషల్ మీడియాలో కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా అసభ్యకర భాష వాడుతున్నారంటూ హైకోర్టు వెల్లడించింది. కిరాయి మూకలుగా పనిచేస్తూ సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిని శిక్షించాల్సిందేనని తేల్చి చెప్పింది. అనంతరం ఈ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ రూ.50వేల జరిమానాను విధించింది. నెల రోజుల్లో లీగల్ సర్వీసెస్ అథారిటీలో రూ.50వేలు చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని దివ్యాంగుల సంరక్షణ కోసం వినియోగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.