ఏపీ ప్రభుత్వం పరిపాలనలో మరో ముందడుగు వేసింది. ఇప్పటికే వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం 161 సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇంటర్ విద్యార్థులకు వెసులుబాటు కల్పించే నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు విద్యాసంస్థలు సకాలంలో ఫీజు చెల్లించని విద్యార్థులకు హాల్‌టికెట్లు నిలిపివేసే సంఘటనలకు చెక్ పెట్టింది. ఈమేరకు ఇంటర్ హాల్ టికెట్లను(Inter Halltickets) వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అందించాలని నిర్ణయించింది. దీంతో విద్యార్థులు నిరభ్యంతరంగా ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాసుకునే అవకాశం కల్పించింది.
ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 9552300009 నంబర్ ద్వారా నేరుగా తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. త్వరలోనే పదవ తరగతి విద్యార్థులకు కూడా వాట్సప్ ద్వారా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే విధానం కల్పించనుంది. కాగా ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఇక వార్షిక పరీక్షలలో భాగంగా మార్చి 1 నుంచి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు.. అలాగే మార్చి 3 నుంచి 20 వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు.