Friday, October 18, 2024
Homeఆంధ్రప్రదేశ్Buggana in Bankers meeting: గృహ నిర్మాణ లబ్దిదారులకు చేయూత నివ్వండి

Buggana in Bankers meeting: గృహ నిర్మాణ లబ్దిదారులకు చేయూత నివ్వండి

కౌలు రైతులు,ఎస్సి,ఎస్టి లబ్దిదారులకు రుణాలు మంజూరులో బ్యాంకులు మరింత తోడ్పడాలి

రాష్ట్రంలోని వివిధ ఎస్సి, ఎస్టి లబ్దిదారులకు,కౌలు రైతులకు రుణాలు మంజూరులో బ్యాంకులు పూర్తి స్థాయిలో లక్ష్యాలను సాధించాలని రాష్ట్ర ఆర్ధిక శాఖామాత్యులు బుగ్గన రాజేంద్ర నాధ్ విజ్ణప్తి చేశారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో 225వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ(SLBC) సమావేశం మంత్రి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా గత ఎస్ఎల్బ్సి సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలు, 2023 సెప్టెంబరు బ్యాంకింగ్ కీ ఇండికేటర్లు, 2023-24 రాష్ట్ర బ్యాంకుల వార్షిక ఋణ ప్రణాళిక (ACP)లో ఇప్పటి వరకూ సాధించిన ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి రాజేంద్రనాధ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రోజు రోజుకూ బ్యాంకులు వివిధ పథకాలకు ఋణాలు మంజూరులో ప్రగతి మెరుగ్గా ఉందని అందుకు వివిధ బ్యాంకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా గత నాలుగేళ్లుగా బ్యాంకుల వార్షిక ఋణ ప్రణాళిక (ACP) లక్ష్యాల సాధనలో మంచి వృద్ది రేటు కన్పిస్తోందని కొనియాడారు. రాష్ట్రంలో డైరీ రంగ అభివృద్ధికి మరీ ముఖ్యంగా జగనన్నపాలవెల్లువకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్ననేపధ్యంలో ఈరంగంలో పెద్ద ఎత్తున లబ్దిదారులకు ఋణాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -


అదే విధంగా ఎస్సి, ఎస్టీ లబ్ధిదారులకు రుణాలు మంజూరులో బ్యాంకులు మరింత ముందుకు రావాలని ఆర్ధికమంత్రి రాజేంద్ర నాధ్ పునరుద్ఘాటించారు.అంతేగాక రాష్ట్రంలో ఈఏడాది 3 లక్షల మందికి పైగా కౌలు రైతులకు 4వేల కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటి వరకూ 75 వేల మందికి పైగా కౌలు రుణాలు అందించారని వీరికి మరింత తోడ్పాటును అందించాలని విజ్ణప్తి చేశారు.గృహ నిర్మాణ పధకాలకు ముఖ్యంగా టిడ్కో గృహాలకు పెద్దఎత్తున రుణాలు అందించాలని కోరారు.విద్యా రుణాలు మంజూరులో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.ఎంఎస్ఎంఇ రంగంలో బ్యాంకుల ప్రగతి గత ఏడాదితో పోలిస్తే మెరుగ్గా ఉందని కొనియాడారు.పియం ముద్రా యోజన తదితర కేంద్ర పధకాలు,ఇతర ప్రాయోజిత పధకాలకు బ్యాంకులు పూర్తిగా తోడ్పాటును అందించాలన్నారు.బ్యాంకులు వివిధ రంగాల్లో రుణాలు అందించడం ద్వారా ఇటు రాష్ట్ర,అటు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసిన వారవుతారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ పేర్కొన్నారు.


ఈసమావేశంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నితీష్ రంజన్ మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ సంక్షేమ పధకాలు పారదర్శకంగా అమలు చేయడం ద్వారా రాష్ట్ర ఆర్ధిక, సామాజికాభివృద్ధికి దోహదం చేయడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగు పర్చేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు వంటివి ఏర్పాటు వల్ల గ్రామ స్థాయి నుండే మెరుగైన అభివృద్ధికి అవకాశం ఏర్పడుతోందని తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి బ్యాంకులు తమ వంతు తోడ్పాటును అందించడం జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో లక్షా 17 వేల వివిధ బ్యాంకింగ్ అవుట్ లెట్ల ద్వారా ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద ఎపి 6 జాతీయ స్థాయి అవార్డులను, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల కింద మంచి అవార్డులను పొందడం అభినందనీయమని ఇడి నితీష్ రంజన్ కొనియాడారు.


ఎస్ఎల్బిసి కన్వీనర్ మరియు యుబిఐ జనరల్ మేనేజర్ యం.రవీంద్రబాబు అజెండా అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ ముందుగా గత ఎస్ఎల్బిసి సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్నచర్యల నివేదికను వివరించారు. తదుపరి 2023-24 బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళికలో రుణాల మంజూరుకు సంబంధించి గత సెప్టెంబరు వరకు సాధించిన ప్రగతిని వివరించారు. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి షార్టు టర్మ్ పంట రుణాలు కింద ఖరీఫ్, రబీకి కలిపి లక్షా 48వేల కోట్ల రూ.లు రుణాలు ఇవ్వాల్సి ఉండగా ఖరీఫ్ లో 82వేల 329 కోట్లు అందించి 56 శాతం లక్ష్యాన్ని సాధించామన్నారు. అదేవిధంగా వ్యవసాయ టర్మ లోన్స్ కు సంబంధించి 68 వేల కోట్ల రూ.లు రుణాలు ఇవ్వాల్సి ఉండగా 43వేల 300 కోట్లు అందించి 64 శాతం లక్ష్యాన్ని సాధించినట్టు పేర్కొన్నారు.ఫార్మ క్రెడిట్ కు సంబంధించి 2లక్షల 16 వేల కోట్లు రూ.లు సహాయం అందించాల్సి ఉండగా లక్షా 25 వేల 629 కోట్లు అందించి 58శాతం లక్ష్యాన్ని సాధించినట్టు తెలిపారు.వ్యవసాయ ఇన్ప్రా మరియు యాన్సిలరీ కింద రూ.15 వేల కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా 15వేల 303 కోట్లు అందించి 101 శాతం లక్ష్య సాధన చేసినట్టు పేర్కొన్నారు.ఎంఎస్ఎంఇ రంగానికి సంబంధించి 69 వేల కోట్ల రూ.లు రుణాలు ఇవ్వాల్సి ఉండగా 53వేల 208 కోట్లు రూ.లు అందించి 78 శాతం లక్ష్య సాధన చేసినట్టు వివరించారు.వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పధకాల్లో స్టాండ్ అఫ్ ఇండియా కింద 93శాతం,పియం ముద్రా యోజన కింద 77 శాతం లక్ష్యాన్ని సాధించామని వివరించారు. ఇంకా పియం ఇజిపిలో 56 శాతం, పియం ఎఫ్ఎంఇలో 83 శాతం, పియం స్వానిధిలో 96 శాతం లక్ష్యాన్ని సాధించామని రవీంద్ర బాబు పేర్కొన్నారు.


సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ మాట్లాడుతూ ఈఆర్ధిక సంవత్సరంలో మొదటి ఎస్ఎల్బిసి సమావేశమని పేర్కొంటూ బ్యాంకులు డైరీ రంగంలో పెద్ద ఎత్తున రుణాలు అందించాలని కోరారు.అలాగే వివిధ ప్రవేట్ బ్యాంకులు కూడా రుణాలు మంజూరులో అన్ని విధాలా ముందుకు రావాలని కోరారు.వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ రాష్ట్రంలో 8లక్షల 29 వేల మంది కౌలు రైతులకు కార్డులు ఇచ్చామని వారందరికీ రుణాలు అందించుటలో బ్యాంకులు తోడ్పడాలని కోరారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ రాజేశ్ కె మహానా మాట్లాడుతూ కెసిసి కార్డుదారులకు మరిన్ని రుణాలు అందించాలని బ్యాంకలను కోరారు. ఎపిలో పియం జన్ ధన్ యోజన కింద 8 గిరిజన జిల్లాలను కవర్ చేయడం జరిగిందని తెలిపారు. తొలుత ఈ సమావేశానికి ఎస్ఎల్బిసి కోఆర్డినేటర్ మరియు యుబిఐ ఎజియం ఇ.రాజు బాబు స్వాగతం పలికారు. ఇంకా ఈ సమావేశంలో చేనేత జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఆర్థిక శాఖ కార్యదర్శి కెవివి. సత్యనారాయణ, నాబార్డు సిజియం ఎంఆర్.గోపాల్, పలువురు అధికారులు, వివిధ బ్యాంకుల రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News