ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu) మెగా డీఎస్సీపై కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీలో గవర్నర్ తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే 16,384 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. రిక్రూట్‌మెంట్ పూర్తి చేసి పోస్టులు ఇచ్చిన తర్వాతనే పాఠశాలలు ఓపెన్ చేస్తామని తెలిపారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. అలాగే అన్నదాత సుఖీభవను కూడా అమలు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం తర్వాత విడతలో ఇచ్చే డబ్బులో కలిపి ఈ పథకం కింద రైతులకు మూడు విడతల్లో రూ.20వేలను అందిస్తామన్నారు.
సేవా దృక్పథంతో పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్ కూడా తీసుకురాలేకపోయిందన్నారు. దీంతో యువతకు ఉద్యోగాలు లేకుండా చేశారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం పెట్టుబడులను తీసుకొచ్చి సంపద సృష్టిస్తామని తెలిపారు. ఉపాధి కల్పన తమ ప్రభుత్వ బాధ్యత అన్నారు. నిరుద్యోగ భృతి కింద నిరుద్యోగులకు నెలకు రూ.3000 త్వరలోనే అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రజలంతా గర్వపడేలా అమరాతిని నిర్మిస్తామని చంద్రబాబు వెల్లడించారు.