Chandrababu Naidu Handloom Weavers: కూటమి ప్రభుత్వం.. నేతన్నలపై వరాల జల్లు కురిపించింది. అనేక సంక్షేమ పథకాలను ప్రకటించింది. చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చేనేత వస్త్రాలపై విధించే జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఆ మొత్తాన్ని కేంద్రానికి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. నేతన్నల కోసం రూ.5 కోట్లతో త్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయాలని, నేత మగ్గాలకు 200 యూనిట్లు, ఇతర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు.
రేపటి నుంచే అమలు..
ఈ నిర్ణయాలను జాతీయ చేనేత దినోత్సవం అయిన ఈ నెల 7వ తేదీ నుంచి అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు. మంగళవారం సచివాలయంలో చేనేత, జౌళి శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. వ్యవసాయం తర్వాత చేనేత రంగమే అతి ముఖ్యమైన రంగమని, దీనిపై ఆధారపడిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇటీవల జమ్మలమడుగు పర్యటనలో చేనేత కుటుంబాలతో సంభాషించినప్పుడు వెల్లడైన సమస్యలను సమీక్షలో సీఎం ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చేనేత ఉత్పత్తులకు 10 జాతీయ అవార్డులు లభించాయని, ‘ఒకే జిల్లా-ఒకే ఉత్పత్తి’ విభాగంలో తొలిసారి అవార్డు దక్కినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా సీఎం అధికారులను ప్రశంసించారు.
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని వేలాది కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, చీరాల వంటి ప్రాంతాలు తమ ప్రత్యేకమైన చేనేత డిజైన్లకు ప్రసిద్ధి చెందాయి. ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటారు. ఆ రోజు నేతన్నల కష్టాన్ని సర్మించుకోవడంతో పాటు చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.


