Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో గణేష్ శోభాయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి, స్థానిక నేత కాకర్ల రంగనాథ్ వర్గాల మధ్య జరిగిన ఘర్షణతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ ఘటనలో ఇరువర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే, శోభాయాత్ర సందర్భంగా ఆసుపత్రిపాలెం వద్ద కాకర్ల రంగనాథ్ వర్గానికి చెందిన గణేష్ విగ్రహం ఊరేగింపు నెమ్మదిగా సాగుతోంది. దీంతో అక్కడికి చేరుకున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి, విగ్రహాన్ని కాస్త వేగంగా కదిలించమని సూచించారు. ఈ సూచనతో రంగనాథ్ ఆగ్రహానికి గురై, జేసీ ప్రభాకర్‌రెడ్డిని దూషించినట్లు తెలుస్తోంది. ఈ వాగ్వాదం కాస్తా రాళ్ల దాడికి దారితీసింది. ఇరువర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఈ ఘర్షణలో కాకర్ల రంగనాథ్‌కు చెందిన ఐషర్ వాహనం, లారీ అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. పరిస్థితి శాంతించిన తర్వాత పోలీసులు శోభాయాత్రను తిరిగి కొనసాగించారు.
ఇటీవల కాకర్ల రంగనాథ్ వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. ఈ చేరిక తర్వాత జేసీ ప్రభాకర్‌రెడ్డి, రంగనాథ్ వర్గాల మధ్య అంతర్గత విభేదాలు తలెత్తాయని స్థానిక రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఘర్షణ ఆ అంతర్గత విభేదాలకు నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు పునరావృతం కాకుండా పోలీసులు అదనపు బలగాలను మోహరించారు.


