CM Chandrababu Clears Pending DA Installments: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. దీపావళి కానుకగా ఒక డీఏను ప్రకటించారు. అయితే, దీన్ని రెండు విడుతలుగా అందజేస్తామన్నారు. నవంబర్‌లో రూ.105 కోట్లు, జనవరిలో రూ.105కోట్లు చెల్లిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగులకు డీఏల కోసం ప్రస్తుతం ప్రతినెలా రూ.160 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. మంత్రివర్గ ఉపసంఘం, ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ డీఏ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు దీపావళి కానుకగా త్వరలోనే ప్రమోషన్లు ఇస్తామని తెలిపారు. ఉద్యోగులు 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ ఎప్పుడైనా వాడుకోవచ్చని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధిలో ఉద్యోగులది కూడా కీలక పాత్ర అని కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులకు రూ. 7 వేల డీఏలు పెండింగ్‌లో పెట్టిందన్నారు. వైసీపీలో ఆర్థిక విధ్వంసం జరిగిందని ఆరోపించారు.
రాష్ట్రాభివృద్దిలో ఉద్యోగులది కీలక పాత్ర..
ఇంకా, ఆయన మాట్లాడుతూ.. “రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రధాన భాగస్వామ్యులు. రాష్ట్ర విభజన తర్వాత అనేక మార్పులు వచ్చాయి. కొన్నింటిని సరిదిద్దే సమయంలో ప్రభుత్వం మారడంతో సమస్యలు ఎక్కడివి అక్కడే ఉండిపోయాయి. మొత్తం 7 వేల కోట్ల రూపాయల డీఏ పెండింగ్‌లో ఉంది. సరెండర్ లీవ్‌కు రూ. 830 కోట్లు బకాయిలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయంలో జరిగిన విధ్వంసాన్ని సరిచేయడానికి 15 నెలలు పట్టింది. ప్రస్తుతం ఉద్యోగులకు రూ. 34 వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. 4 డీఏలు పెండింగ్ ఉన్నాయి. రూ. 7 వేల కోట్ల రూపాయలు డీఏ బకాయిలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలు క్యాపిటల్ ఎక్సెపెండిచర్ పెంచి ఆదాయాలు పెంచుకుంటే మన వద్ద రివర్స్ అయ్యింది. గత ప్రభుత్వం ఎక్సైజ్‌లో భవిష్యత్తు ఆదాయంపైనా అప్పు తెచ్చింది. దీంతో, ఆదాయం తగ్గి జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.” అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
వైసీపీ విధ్వంసంతో తగ్గిన రాష్ట్ర ఆదాయం..
కాగా, మొత్తం ఉద్యోగులకు కలిసి రాష్ట్ర రెవెన్యూలో 99.50 శాతం జీతభత్యాలకు పోతోందని చంద్రబాబు అన్నారు. రూ. 51,200 కోట్లు ఉద్యోగుల జీతాలకు ఖర్చు చేయాల్సి వస్తుందని, ఆర్థిక ఇబ్బందులతో జీతాలు చెల్లించలేని పరిస్థితి తలెత్తినప్పటికీ పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏల్లో ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. ఈ ఏడాది రూ. 51, 400 కోట్లు రాష్ట్ర ఆదాయం అయితే రూ. 51, 200 కోట్లు జీతాల రూపేణా ఇచ్చామన్నారు. మన రాష్ట్రంలో 99 శాతం రెవెన్యూ హెచ్‌ఆర్‌కే వెళ్తుందన్నారు. రాష్ట్రాల రెవెన్యూలో కేరళ 68 శాతం, తెలంగాణ 38 శాతం, తమిళనాడు 42, కర్ణాటక 38 శాతం జీతభత్యాలకు ఇస్తోందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.


