టెక్నాలజీ వాడుకోవడంలో ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) తర్వాతే ఏ నాయకుడైనా అనడంలో ఎలాంటి సందేహం లేదు. తొలిసారి సీఎం అయిన దగ్గరి నుంచి ఆయన పాలనలో టెక్నాలజీ వాడకానికి పెద్ద పీట వేస్తుంటారు. తాజాగా తన భద్రత విషయంలో కూడా టెక్నాలజీ వినియోగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సిబ్బందికి బదులు అటానమస్ డ్రోన్ల(Autonomous Drone) సాయంతో పహారా కాయనున్నారు.
ఈ డ్రోన్ టెక్నాలజీ పరిసరాల్లో కొత్తగా, అనుమానాస్పదంగా ఏది కనిపించినా వెంటనే మానిటరింగ్ టీమ్‌కు సమాచారం చేరవేస్తోంది. మళ్లీ దానికి కేటాయించిన డక్‌పై అదే ఛార్జింగ్ పెట్టుకుంటుంది. ఈ డ్రోన్ అటనామస్ విధానంలో ఆటోపైలెట్‌గా ఆయా ప్రాంతాల్లో ఎగురుతుంది. ఈ డ్రోన్ పంపే డేటా ఇంటి పరిసర ప్రాంతాల్లో సెక్యూరిటీని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు ఆదేశాలతో అధికారులు భద్రతలో మార్పులు చేశారు. కాగా ప్రస్తుతం ఆయన భద్రత కోసం 120 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం.