Montha Cyclone Train Cancelled: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి ‘మొంథా’ తుపాను (Cyclone Montha)గా మారడంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. తుపాను తీవ్రత, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 27 నుంచి 30 తేదీల మధ్య నడవాల్సిన వందకు పైగా రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది.
తుపాను ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైల్వే అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. తొలుత విశాఖపట్నం మీదుగా రాకపోకలు సాగించే 43 రైళ్లను ఈస్ట్‌కోస్ట్ రైల్వే (ECoR) రద్దు చేయగా, ఆ తర్వాత దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలో మరో 75కు పైగా రైళ్లను రద్దు చేసింది. దీంతో మొత్తం రద్దైన రైళ్ల సంఖ్య 100కు పైగానే ఉంది. విజయవాడ, రాజమండ్రి, కాకినాడ పోర్టు, గుంటూరు, తెనాలి, విశాఖపట్నం వంటి కీలక మార్గాల్లో ఈ రద్దు ప్రభావం ఎక్కువగా ఉంది.
రద్దు చేసిన రైళ్లలో సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్, డబుల్ డెక్కర్, మెము, ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం-హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-కిరండూల్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం-తిరుపతి, విశాఖపట్నం-గుంటూరు డబుల్ డెక్కర్ వంటి ప్రధాన సర్వీసులను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు.
ఈ రైళ్ల రద్దు వివరాలను రైల్వే అధికారులు తమ అధికారిక ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) ఖాతాలు, ఇతర వేదికల్లో పోస్ట్ చేశారు. తుపాను కారణంగా విమాన సర్వీసులు కూడా రద్దయ్యాయి. ప్రయాణికులు తమ టికెట్ డబ్బులు తిరిగి పొందేందుకు వీలుంది. తుపాను తీవ్రత తగ్గిన తర్వాతే రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని రైల్వేశాఖ ప్రకటించింది. కావున, ప్రయాణికులు తాము ప్రయాణించాల్సిన రైలు స్టేటస్‌ను ముందుగా రైల్వే ఎంక్వైరీ లేదా అధికారిక వెబ్‌సైట్లలో తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు. సహాయక చర్యల కోసం అత్యవసర నియంత్రణ గదులను ఏర్పాటు చేశారు.


