ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో కొత్తగా ఓ ప్రతిపాదనను టీడీపీ నేతలు లేవనెత్తుతున్నారు. అదేంటంటే టీడీపీ యువ నేత, మంత్రి నారా లోకేష్(Nara Lokesh)కు డిప్యూటీ సీఎం(Deputy CM) ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ముందుగా ఈ డిమాండ్‌ను మహాసేన రాజేష్(Mahasena Rajesh) తీసుకురాగా.. ఇప్పుడు టీడీపీ నేతలు ఒకరి తర్వాత ఒకరు దీనికి మద్దతుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు కడప జిల్లా పర్యటనలో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస రెడ్డి.. బాబు ముందే ఈ ప్రతిపాదన గురించి మాట్లాడారు. లోకేష్ పార్టీ కోసం ఎంతో శ్రమించారని తెలిపారు.
తాజాగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వర్మ (Varma)లోకేష్‌కు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. పార్టీలో కోటి సభ్యత్వాలు చేసిన ఘనత లోకేష్‌కే దక్కుతుందన్నారు. టీడీపీకి భవిష్యత్తు లేదన్న వారందరికీ లోకేష్ యువగళంతో సమాధానం చెప్పారన్నారు. లోకేష్ కష్టాన్ని గుర్తించాలని క్యాడర్ కోరుకోవడంలో తప్పేముందని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను జనసేన కార్యకర్తలు సీఎం సీఎం అని పిలుస్తున్నారని.. అలాంటిది టీడీపీని బలోపేతం చేసి, కార్యకర్తల్లో ధైర్యం నింపిన లోకేష్‌ను డిప్యూటీ సీఎం అంటే తప్పేంటన్నారు. ఏదేమైనా తమ అధినేత చంద్రబాబు తీసుకునే నిర్ణయమే కార్యకర్తలందరికీ శిరోధార్యం అని చెప్పారు.
ఇక మరో సీనియర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(Somireddy Chandra Mohan Reddy) కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయంగా అనేక డక్కామొక్కిలు తిని, అవమానాలు ఎదుర్కొన్న తర్వాత యువగళం పాదయాత్రతో తనలోని నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారని తెలిపారు. లోకేష్ పోరాటపటిమను చూసి పార్టీ క్యాడర్‌తో పాటు రాష్ట్ర ప్రజానీకం కూడా అండగా నిలిచి జైకొట్టిందని గుర్తుచేశారు. డిప్యూటీ సిఎం పదవికి అన్ని విధాల అర్హుడైన లోకేష్ పేరును పరిశీలించాలని పార్టీని కోరుతున్నానని డిమాండ్ చేశారు.
మొత్తానికి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి పవన్ కళ్యాణ్‌తో పాటు ప్రభుత్వంలో సమ ప్రాధాన్యం కల్పించే దిశలో భాగంగానే టీడీపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు.