Tirumala| తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ లేని భక్తులకు స్వామివారి దర్శనం కోసం 8 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి మాత్రం 3 గంటలకు పైగా సమయం పడుతుందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 25 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నిన్న(శనివారం) ఒక్కరోజే శ్రీవారిని 73,558 మంది భక్తులు దర్శించుకోగా.. వీరిలో 32,675 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఇక భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.79 కోట్లు వచ్చింది.
మరోవైపు పవిత్రమైన కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో పుష్పయాగాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. సువాసనలు వెదజల్లే 17 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాభరణాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ పుష్ప కైంకర్యం నిర్వహించారు. పుష్పయాగానికి మొత్తం 9 టన్నుల పుష్పాలు, పత్రాలను దాతలు అందించారు.