రేషన్ బియ్యం అక్రమాలపై కూటమి ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి పేర్ని నానికి(Perni Nani) చెందిన గోదాముల్లో రేషన్ బియ్యం మాయమైందని ఆయనతో పాటు ఆయన భార్య, కుమారుడుపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఆయన పరారీలో ఉన్నారని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై నాని స్పందించారు. తాను కేసులకు భయపడి ఎక్కడికీ పారిపోలేదు అన్నారు. తనను, తన కుమారుడిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారని తెలిపారు. అనవసరంగా తన భార్యను ఇందులోకి లాగుతున్నారని వాపోయారు. తనపై శాఖ పరమైన విచారణ కంటే సోషల్ మీడియా విచారణ ఎక్కువగా కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన భార్య గోదాములో సివిల్ సప్లై అధికారులు ధాన్యం ఉంచిన మాట వాస్తవమేనని తెలిపారు. అయితే అందులో మిస్ అయిన వాటికి డబ్బులు చెల్లించామన్నారు. నైతికంగా బాధ్యత వహిస్తూనే ఈ డబ్బులు చెల్లించామన్నారు. తన భార్యను అరెస్ట్ చేయించాలని ఓ మంత్రి చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu) దగ్గర కూడా ఈ విషయం చర్చించామని తెలిపారు. మహిళల జోలికి వెళ్లొద్దని చంద్రబాబు చెప్పారని.. అయినా కానీ వారి ప్రయత్నాలు ఆపడం లేదని నాని వెల్లడించారు.