Ganta Srinivasa Rao: టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలోనూ గంటాపై ఇలాంటి వార్తలే వచ్చినప్పటికీ ఆయన పార్టీ మారకుండా టీడీపీలోనే కొనసాగారు. గతంలో పలు సార్లు నేను పార్టీ మారనని కుండబద్దలు కొట్టారు. ఇటీవల మరోసారి గంటా పార్టీ మారుతున్నారని, వైసీపీ తరపున ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడని ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. గంటా వర్గీయులు మాత్రం ఆయన పార్టీ మార్పుపై ఎలాంటి సమాచారం లేదని చెబుతూ వచ్చాయి. కానీ, రోజురోజుకు గంటా పార్టీ మారుతున్నాడని వార్తలు విస్తృతంగా వస్తుండటంతో ఆయన ఎట్టకేలకు మరోసారి క్లారిటీ ఇచ్చాడు.
గంటా శ్రీనివాస్‌రావు జగన్ సమక్షంలో జనవరిలో వైసీపీలో చేరుతాడని వైసీపీకి చెందిన పలువురు నేతలుసైతం వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయంపై ఎట్టకేలకు గంటా క్లారిటీ ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో.. టీడీపీని ఎట్టిపరిస్థితుల్లో వీడేది లేదని గంటా అన్నాడు. ‘నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు చంద్రబాబుతోనే నా ప్రయాణం ఉంటుందని, తెలుగుదేశం పార్టీలోనే ఉంటానంటూ స్పష్టంగా తెలిపారు.
తెలుగుదేశం పార్టీ విజయం కోసం పని చేస్తానని, సోషల్ మీడియాలో ఏవేవో రాస్తుంటారు, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రతీసారి నేను ఇలా వివరణ ఇవ్వటం పరిపాటిగా మారిందని, మళ్లీ కొందరు కావాలని పార్టీ మారుతున్నారంటూ వార్తలు ప్రచారం చేయడం సర్వసాధారణంగా మారిందని గంటా ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటా వ్యాఖ్యలతో సంతోషం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు.. ఆయాన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ వీడియో ఎప్పటిది అనేదానిపై క్లారిటీ లేదు.