తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు టీటీడీ(TTD) శుభవార్త అందించింది. వేసవి సెలవుల్లో తిరుమలలో(Tirumala) భక్తుల రద్దీ పెరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో భక్తుల కోసం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ఈమేరకు తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మొదటి ఘాట్ రోడ్డులోని అక్కగార్ల గుడి, శ్రీవారి సేవా సదన్, భక్తుల రద్ధీ అధికంగా ఉండే ప్రాంతాల్లో చలువ పెయింట్ వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అలాగే యాత్రికులకు అసౌకర్యం కలగకుండా విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండేలా చూడాలని సూచించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లను తగినంత నిల్వ ఉంచాలని తెలిపారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుఎండా తిరుమలలోని అన్ని ప్రాంతాల్లో భక్తులకు అవసరమైన నీటిని సరఫరా చేసేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.