Onion and Tomato Price Crash: కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభానికి చంద్రబాబు నిర్లక్ష్య ధోరణే కారణమని తెలిపారు. ఉల్లి, టమోటా వంటి పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడంపై ఎక్స్ ఖాతాలో తన ఆవేదనను వ్యక్తం చేస్తూ పోస్ట్ చేశారు.
ధరల పతనంపై ప్రశ్నల వర్షం: “చంద్రబాబుగారూ.. పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు,” అని జగన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. కర్నూలులో ఉల్లి కిలో రూ. 3, టమోటా కిలో రూ. 1.50కి పడిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. “రైతు బతకొద్దా? కొన్ని వారాలుగా రైతులు ఇబ్బందులు పడుతున్నా మీరు కనికరం చూపడం లేదు. ముఖ్యమంత్రిగా ఉండి కూడా రైతులను ఆదుకోవడంలో ఇంత నిర్లక్ష్యం ఎందుకు?” అని ఆయన ప్రశ్నించారు.
Also Read:https://teluguprabha.net/andhra-pradesh-news/another-governor-post-for-tdp-bjps-strategic-moves/
ప్రభుత్వ వైఖరిపై విమర్శలు: క్వింటాల్ ఉల్లిని రూ. 1,200కు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేసి.. ఆ తర్వాత కర్నూలు మార్కెట్లో వేలం వేయించిందని జగన్ ఆరోపించారు. ఎవరూ కొనుగోలు చేయడం లేదన్న భావన కలిగించడానికి ప్రభుత్వం కావాలనే ఇలా చేసిందని విమర్శించారు. రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నా.. బిగ్ బాస్కెట్ వంటి ఆన్‌లైన్ స్టోర్‌లలో కిలో ఉల్లి రూ. 29-32, రైతు బజార్లలో రూ. 25కు ఎందుకు అమ్ముతున్నారని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ తప్పు కాదా అని నిలదీశారు.
మానవత్వం చూపండి: టమోటా ధరలు కూడా దారుణంగా పడిపోవడంతో రైతులు పంటలను రోడ్డుపై పారబోస్తున్నారని జగన్ పేర్కొన్నారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం కనీసం దృష్టి పెట్టకపోవడం అన్యాయమని అన్నారు. “చంద్రబాబుగారూ.. తక్షణం రైతుల పంటలను కొనుగోలు చేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపండి” అని తన పోస్ట్‌లో కోరారు.
రైతుల అవస్థలకు కారణం అదే: ప్రభుత్వం నుంచి వెళ్లాల్సిన ఎరువుల్ని టీడీపీ నేతలు దారి మళ్లించి.. అధిక ధరలకు అమ్ముకుంటున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. యూరియాలో రూ.250 కోట్ల స్కామ్ జరిగిందని అన్నారు. బ్లాక్‌మార్కెట్ దందాలో చంద్రబాబే భాగస్వామిగా ఉన్నారని అన్నారు. రైతులను పీడించగా వచ్చిన సొమ్మును.. కింద నుంచి పై నేత వరకు అందరూ పంచుకుంటున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు.


