ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన పార్టీ ప్లీనరీ సమావేశాలు పిఠాపురంలో జరగనున్నాయి. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 3 రోజులపాటు ప్లీనరీ జరపాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 12, 13, 14 తేదీలలో ఈ సమావేశాలు నిర్వహిస్తారని తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో విజయవాడలో కోర్ కమిటీ సమావేశమై వివిధ అంశాలపై చర్చించింది.
ప్లీనరీ సమావేశాల్లో భాగంగా పార్టీలో సంస్ధాగతంగా కీలక మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అంతేకాదు ఈ ప్లీనరీ సమావేశాల నుంచి డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటన ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 6 నెలల పాలన వలన జనసేనకు ఎలాంటి ఫలితాలు వచ్చాయనే అంశంపై ప్లీనరీలో కీలక సమీక్ష నిర్వహించనున్నారు జనసేన నేతలు.
ఇప్పటికే ప్లీనరీ నిర్వహణకు పిఠాపురం నియోజకవర్గంలో స్ధలం పరిశీలన కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి జనసేన ప్లీనరీ సమావేశానికి ఏర్పాట్లు చేయనున్నారు. ప్రధానంగా పార్టీ సంస్ధాగత అంశాలపై ఈ ప్లీనరీలో పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.