లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో(Delimitation) దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనుందని సౌత్ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం డీలిమిటేషన్‌పై తీవ్రంగా పోరాడుతోంది. ఈ క్రమంలోనే చెన్నై వేదికగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసింది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy), టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పాల్గొన్నారు. అలాగే పంజాబ్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భగవంత్ మాన్, పినరయి విజయన్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్, తదితరులు ఈ భేటీకి హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ఓ లేఖ విడుదల చేసింది. చెన్నైలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి హాజరుకాలేదని తెలిపింది. అఖిల పక్ష సమావేశానికి(All Party Meeting) హాజరుకావాలని తమకు ఆహ్వానం అందిందని.. కానీ తాము హాజరుకాలేమని సమాచారం అందించామని పేర్కొంది. ఈ భేటీ జనసేన నేతలు హాజరైనట్లు వస్తున్న వార్తలు ఊహాగానాలని స్పష్టం చేసింది. వేర్వేరు కూటములుగా ఉన్నందున్న సమావేశంలో పాల్గొనడం లేదని మర్యాదపూర్వకంగా తెలియజేయాలని తమ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) దిశానిర్దేశం చేశారంది. ఈ మేరకు తాము సమాచారం అందించామని లేఖలో చెప్పుకొచ్చింది. డీలిమిటేషన్‌పై తమ అభిప్రాయాన్ని సరైన వేదికపై వెల్లడిస్తామని తెలియజేసింది.
