తెలుగు రాష్ట్రాలు నీటి వివాదాలను పరిష్కరించుకోవాలని మాజీ సీఎం, బీజేపీ నేత కిరణ్‌కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy)సూచించారు. విజయవాడలో హైకోర్టు న్యాయవాది రవితేజ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సంక్రాంతి ఆత్మీయ కలయిక’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇక ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా రెండు రాష్ట్రాల మధ్య ఇంకా సమస్యలున్నాయని తెలిపారు. దేశంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని.. దీంతో ఎన్నికలంటేనే భయం వేస్తోందన్నారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయలేమన్నారు. డబ్బు లూటీ చేసే కొందరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని.. ప్రజలు కూడా వారికి ఓట్లు వేస్తున్నారని చెప్పారు. ఏ పార్టీలో ఉన్నా వ్యక్తిగా తాను మారలేదన్నారు. దేశ అభివృద్ధి కోసం బీజేపీ కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు.