అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ పునరాభివృద్దికి కర్నూలు రైల్వే స్టేషన్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. కర్నూలు నగరంలోని కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ లో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 508 రైల్వే స్టేషన్లు (భారతీయ రైల్వేల అంతటా) పునరాభివృద్ధిలో భాగంగా కర్నూలు రైల్వేస్టేషన్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. కర్నూలు రైల్వే స్టేషన్ నందు ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసారంలో కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్, కర్నూలు శాసనసభ్యులు హాఫిజ్ ఖాన్, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, నగర మేయర్ బివై. రామయ్య, రైల్వే శాఖ సీనియర్ డిఎన్సి లైన్స్ అనిల్ కుమార్, రైల్వే శాఖ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా పార్లమెంటు సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మన కర్నూలు సిటీ ఎంపిక కావడం చాలా సంతోషమన్నారు. దక్షిణాది రాష్ట్రాలను హైదరాబాదుతో అనుసంధానం చేస్తున్న ముఖ్యమైన మార్గాలలో ఉన్న కర్నూలు నగర ప్రజల సౌకర్యార్థం దాదాపుగా రూ.42.62 కోట్ల వ్యయముతో “అమృత్ భారత్ స్టేషన్” పథకం కింద అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధమైందని అన్నారు. భారతదేశంలో రైల్వే వ్యవస్థ అతి పెద్ద వ్యవస్థని ఈ వ్యవస్థను రక్షించుకోవడంలో హక్కులతో పాటు బాధ్యతలు ఉంటాయన్నారు. రైల్లో ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరు టికెట్ కొనాలని, రైల్వే పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఉద్యమాల సమయంలో రైల్వే ఆస్తులకు నష్టం కలవకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనదే అన్నారు. ముఖ్యంగా కర్నూలు పట్టణం నుండి మచిలీపట్నంకు వెళ్లే ట్రైన్ ను పునరుద్దించాలని అలాగే ఈ ట్రైన్ మూడు రోజులకు ఒకసారి కాకుండ ప్రతిరోజు వెళ్లేలా చూడాలని, కర్నూలు, విజయవాడకు రోడ్డు మార్గం సరిగా లేనందున ప్రజలు రైల్వే ప్రయాణంపై ఆసక్తి చూపిస్తారని ప్రతిరోజు రైలును నడపాలని, ఈ రైల్వే స్టేషన్ కు ఫిట్ లెన్స్ ఏర్పాటు చేయాలని, వర్క్ షాప్ కూడ ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులను ఎంపీ కోరారు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ మన కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ దాదాపు 43 కోట్ల రూపాయల వ్యయంతో రీమోడల్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ నిధులను మంజూరు చేయించడంలో మన స్థానిక పార్లమెంట్ సభ్యుల కృషి ఎంతగానో ఉందన్నారు, అందుకు మన ఎంపీకి ధన్యవాదాలు తెలుపుకోవాలన్నారు.
కర్నూలు శాసనసభ్యులు హాఫిజ్ ఖాన్ మాట్లాడుతూ మన ప్రాంతం వెనుకబడిన ప్రాంతమని పేద ప్రజలు తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే సౌకర్యం ఒక రైలు ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ఈరోజు “అమృత్ భారత్ స్టేషన్” పథకం లో భాగంగా కర్నూలు ఎంపిక చేసి మన రైల్వే స్టేషన్ ను పునరుద్దీకరణ చేస్తున్నందుకు ప్రధానమంత్రికి రైల్వే శాఖ మంత్రికి మన ఎంపీకి కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నారు. నగర మేయర్ బివై.రామయ్య మాట్లాడుతూ కర్నూలు నగరానికి రైల్వే శాఖ తలమానికం లాంటిదని, తక్కువ ఖర్చుతో ఎక్కువ మందిని సుదూర ప్రాంతాలకు చేర్చేది ఒక రైలు మార్గమే అన్నారు. అలాంటి రైల్వే లైన్లను అభివృద్ధి చేయడం అందులో కర్నూలును ఎంపిక చేసినందుకు మన ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మన జిల్లా వెనకబడిన ప్రాంతమని ఇంకా కొత్త రైళ్లను నడపాలని కర్నూల్ నుండి ఓర్వకల్లు, పాణ్యం మీదుగా నంద్యాలకు, కర్నూలు నుండి శ్రీశైలం వయా మార్కాపురానికి కర్నూలు నుండి మంత్రాలయానికి నూతన రైల్వేలైన్లను వేస్తే బాగుంటుందని, రైల్వే అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఇన్చార్జి రాఘవేంద్ర, కర్నూలు, నగర డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక, స్టేషన్ మేనేజర్ సుంకన్న, రైల్వే స్టేషన్ సిబ్బంది, జిల్లా అధికారులు, డిసిఎంఎస్ చైర్మన్ శిరోమణి, ప్రజా సంఘాల ప్రతినిధులు, కుల సంఘాల ప్రతినిధులు, ఎన్సిసి విద్యార్థులు, వివిధ పాఠశాల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.