ఏపీలోని కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అన్నమయ్య జిల్లా(Annamayya District)లో భారీగా పోలీసులను బదిలీ(Police Transfers) చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాయచోటి, రాజంపేట, మదనపల్లె సబ్ డివిజన్ పరిధిలోని వివిధ స్థాయిలో ఉన్ పోలీసులను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు, ఐదు సంవత్సరాలుగా ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న పోలీసులను స్థానచలనం చేశారు. ఏకంగా 228 మంది కానిస్టేబుళ్లు, 123 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 41 మంది ఏఎస్సైలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తం 382 మంది పోలీసులు బదిలీ కాగా వెంటనే వారికి పోస్టింగ్ కేటాయించిన పోలీస్ స్టేషన్లలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
కాగా ఇటీవల అన్నమయ్య జిల్లాలో టీడీపీ కార్యకర్తను వైసీపీ కార్యకర్త దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. తనకు వైసీపీ కార్యకర్తలు నుంచి ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని టీడీపీ కార్యకర్త పోలీసులకు విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. అయినా కానీ పోలీసులు పట్టించుకోకపోవడంతో దారుణ హత్యకు గురయ్యారు. దీంతో విధుల్లో నిర్లక్ష్యంగా వహించిన సీఐ, హెడ్ కానిస్టేబుల్‌పై వేటు పడింది. అన్నమయ్య జిల్లాలో వైసీపీ నేతలకు కొమ్ముకాసిన పోలీసులే ఇంకా విధులు నిర్వహిస్తున్నారని.. తెలుగుదేశం అధికారంలో ఉన్నా కూడా వైసీపీ నేతల మాటలే వింటున్నారని టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరాల తరబడి ఒకే ప్రాంతంలో బాధ్యతలు నిర్వహిస్తున్న వారిపై బదిలీ వేటు వేయాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం తాజాగా భారీగా పోలీసులను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.