Friday, January 31, 2025
Homeఆంధ్రప్రదేశ్AP: విపత్తులు ఎదుర్కొనేలా 14,000 మందికి ట్రైనింగ్

AP: విపత్తులు ఎదుర్కొనేలా 14,000 మందికి ట్రైనింగ్

మాక్ డ్రిల్

తుపాను, వరదలు, అగ్నిప్రమాదం వంటి ప్రకృతి విపత్తుల నిర్వహణకు సంబంధించి మాక్ ఎక్సర్‌సైజ్ ను బుధవారం (29-01-2025) విశాఖపట్నం విమానాశ్రయంలో నిర్వహించినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. జాతీయ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలు, ఎయిర్‌ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. మేజర్ జనరల్ ఏకే వర్మ, విశాఖ ఎయిర్ పోర్టు అథారిటీ డైరెక్టర్ పురుషోత్తం, విశాఖ జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

దుబాయ్ నుంచి హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర సచివాలయం నుంచి రెవెన్యూ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా, డిల్లీ నుంచి ఎన్డీఎంఏ మెంబర్, లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అటా హస్నైన్ , వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో పాల్గొని అధికారులకు సూచనలు జారీ చేశారు.

హోంమంత్రి మాట్లాడుతూ హుద్ హుద్, తిత్లీ వంటి తుపానుల ప్రభావంతో విశాఖ ఎయిర్ పోర్టు కూడా ఎక్కువ ప్రభావానికి గురైందన్నారు. విశాఖ, రానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాలు విపత్తుల నుంచి సంరక్షించే నేపధ్యంలో మాక్ ఎక్సర్ సైజ్ నిర్వహించామన్నారు. మొదటి స్పందనదారులు ఆపదమిత్ర వాలంటీర్లను మరికొంత మందిని తీసుకుని వారికి రెస్క్యూ ఆపరేషన్స్ లో శిక్షణ ఇవ్వాలని సూచించారు. విపత్తుల నిర్వహణలో సంబధించి వ్యవసాయ, విద్యుత్, ఇరిగేషన్, మెడికల్&హెల్త్ , పిఆర్&ఆర్డీ, ఇతర శాఖలను సహాయక చర్యల్లో పాల్గొనే ఎన్డీఆర్ఎఫ్ , ఎస్డీఆర్ఎఫ్ , సివిల్ డిఫెన్స్, ఆర్మీ, నేవీ, పోలీసు, ఫైర్ సిబ్బందిని సమన్వయ పరచుకోవాలన్నారు.

ముఖ్యమంత్రి ఆదేశానుసారంగా గత అనుభవాలని దృష్టిలో ఉంచుకుని విపత్తుల నిర్వహణలో రాష్ట్ర స్థాయి , జిల్లా స్థాయి , గ్రామస్థాయిలోని అధికారులకు సుమారు 14వేల మందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. మే నెల లోపు అన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ శాఖలు మాక్ డ్రిల్స్ లోని లోటుపాటులను గుర్తించి సరిచేసుకోవడం వలన తుపాను, వరదలు వంటి విపత్తులు సంభవించనప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోని ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించుకోవడానికి దోహదపడుతుందన్నారు.

సీనియర్ కన్సల్టెంట్, ఎన్డీఎంఏ, మేజర్ జనరల్(Rtd), ఏకె వర్మ మాట్లాడుతూ విపత్తుల్లో మొదటి స్పందనదారులుగా ఆపదమిత్ర వాలంటీర్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమాచార వ్యవస్థ దెబ్బతిన్నపుడు టెలికాం డిపార్టమెంట్ తో సమన్వయ పరుచుకుని కమ్యూనికేషన్ రూటింగ్ చేయాలని సూచించారు. ఎయిర్ పోర్టు సమీపంలో కెమికల్ డిజాస్టర్, అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు వెంటనే ప్రతిస్పందించి ఎయిర్ పోర్టు ఎమర్జన్సీ ప్లాన్ అమలు చేయాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , టెక్నాలజీ, నూతన సాంకేతిక పరికరాలు వినియోగించాలన్నారు.
రెవెన్యూ స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ అర్బన్ ఫ్లడింగ్ ప్రస్తావించి గత సంవత్సరం వరదల్లో విజయవాడ నగరం దాదాపు ఏడు రోజుల పాటు ముంపునకు గురైందని టెక్నాలజీ వినియోగించి సమర్ధవంతంగా ఎదుర్కోన్నామన్నారు. విపత్తుల్లో ముందస్తు హెచ్చరికల ఇవ్వడం ద్వారా రెస్క్యూ సమయంలో సమర్ధవంతమైన ప్రతిస్పందన ఉంటుందని తెలిపారు. స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ), సరైన పర్యవేక్షణతో నష్టాన్ని తగ్గించుకోగలమని వివరించారు.

తుపాను, వరదలు సంభవించినపుడు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి తీసుకునే అన్నిచర్యలు యధావిధిగా తీసుకున్నామని మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వివరించారు. తుపాను హెచ్చరిక జారీతో మాక్ ఎక్సర్ సైజ్ ప్రారంభించారు. జిల్లా యంత్రాంగానికి ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేశారు. ముందుగానే ఎన్డీఆర్ఎఫ్ , ఎస్డీఆర్ఎఫ్, పైర్ సర్వీసెస్ బృందాలను మోహరింపజేశారు.
తుపాను సమయంలో ఎయిర్ పోర్టు టెర్మినల్లో ఉన్న ప్రయాణికలను, పిల్లలను ఎన్డీఆర్ఎఫ్ , ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రోప్ వే ద్వారా సురక్షితంగా తీసుకువచ్చారు. గాయపడిన వారిని అంబులెన్స్ లో హాస్పిటల్స్ కు తరలించారు. అగ్ని ప్రమాదం జరిగినపుడు భయబ్రాంతులకు గురికాకుండా ఎలా స్పందించాలో అగ్నిమాపక సిబ్బంది ప్రత్యక్షంగా ప్రదర్శించి ఆహుతులను చైతన్య పరిచారు.

ఎన్డీఎంఏ, ఎస్డీఎంఏ, ఎయిర్ పోర్ట్ అథారిటీ, ఎన్డీఆర్ఎఫ్ , ఎస్డీఆర్ఎఫ్ , సివిల్ డిఫెన్స్, ఆర్మీ, నేవీ, ఫైర్ సర్వీసెస్, పోలీసు, మెడికల్&హెల్త్, పిఆర్&ఆర్డీ, ఇతర శాఖల అధికారులు, ఆపదమిత్ర వాలంటీర్లు మాక్ ఎక్సర్‌సైజ్ లో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News