జనసేన పార్టీ(Janasena Party) 12వ ఆవిర్భావ దినోత్సవ సభ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మార్చి 14వ తేదీన ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. 12వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు(Chandrababu), మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు పురందేశ్వరి, NDA పక్ష నాయకులకు, ఇతర నాయకులు, చిత్ర పరిశ్రమ మిత్రులు, శ్రేయోభిలాషులకు మనస్ఫూర్తిగా జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ధన్యవాదాలు తెలిపారు. అలాగే రానున్న రోజుల్లో మరింత బలమైన పార్టీగా నిర్మాణం చేయడంతో పాటుగా, సామాన్యుల గొంతుకగా, రాష్ట్ర ప్రయోజనాలు, జాతీయ ఐక్యత లక్ష్యంగా మరింత బాధ్యతగా పనిచేసే దిశగా జనసేన పార్టీ అడుగులు వెయ్యనుందని చెప్పారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
అలాగే ఈ వేడుకను ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించుకునేందుకు, అన్ని విధాలుగా సహకరించి, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేసిన పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్షేత్ర స్థాయిలో పనిచేసిన ప్రతి ఒక్క పోలీస్ అధికారికి, బందోబస్తులో కీలక పాత్ర పోషించిన కానిస్టేబుల్ సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా వీక్షించేందుకు, కార్యక్రమ సారాంశాన్ని చేరవేసేందుకు అన్ని విధాలుగా సహకరించిన మీడియా మిత్రులకు, పాత్రికేయులకు, లైవ్ కవరేజ్ అందించిన సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. జనసేన పార్టీ 11 ఏళ్ల ప్రయాణాన్ని వివరిస్తూ పార్టీ చేపట్టిన కార్యక్రమాలను, వివరిస్తూ వివిధ డాక్యుమెంటరీలో రూపొందించి వాటిని ప్రజలకు తెలిసేలా ప్రదర్శించిన జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం, వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు. ప్రదర్శనలు నిర్వహించారని గుర్తు చేశారు.
తీవ్రమైన ఎండ ఉన్నప్పటికీ, కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి డిహైడ్రేషన్ అవ్వకుండా వారికి దారి పొడవునా ఫుడ్ స్టాల్స్ ఏర్పాటుచేసి పండ్లు, మజ్జిగ, నీరు, ఆహారం అందించిన ఫుడ్ కమిటీ విభాగానికి, స్టేజ్ డెకరేషన్, లైటింగ్, సౌండింగ్ బృందానికి, ప్రతి ఒక్క కార్మికుడికి, కార్యక్రమం అనంతరం ప్రాంగణాన్ని పరిశుభ్రం చేసి, స్వచ్ఛ ఆంధ్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అభినందించారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతం కోసం నూతన ఉత్సాహంతో, ప్రజల పక్షాన నిలబడి పనిచేయాల్సిందిగా జనసేన శ్రేణులకు పిలుపునినిచ్చారు.