లిక్కర్ స్కాంలో తప్పుడు ఆరోపణలతో మాజీ సీఎం వైఎస్ జగన్(Jagab)ను అరెస్ట్ చేయాలని చూస్తుందని మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్సైజ్ శాఖలో గతంలో ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డిని బెదిరించి తప్పుడు స్టేట్మెంట్‌లు తీసుకున్నారని ఆరోపించారు. ఇలా తప్పుడు స్టేట్మెంట్‌లతో ఏదో ఒక రకంగా జగన్‌ను అరెస్ట్ చేయాలనే ఉద్దేశం కనిపిస్తోందన్నారు. తప్పుడు వాంగ్మూలాలతో ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు లోక్‌సభలో మాట్లాడినంత మాత్రాన భయపడేది లేదన్నారు. స్కిల్ స్కాంలో సీఎం చంద్రబాబుకి ఇచ్చిన ఈడీ, ఐటీ నోటీసులపై కూడా మాట్లాడాలని డిమాండ్ చేశారు.
ఏపీలో లిక్కర్ స్కాం జరిగితే వైసీపీలోనే ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం, మంత్రులు, ఎంపీలు ఇకనైనా కక్షసాధింపు రాజకీయాలు మానుకోవాలి అని హితవు పలికారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భారీ లిక్కర్ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. లిక్కర్ వ్యాపారులను బెదిరించి సీఎం నుంచి ఎమ్మెల్యే దాకా కమీషన్లు దండుకున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
కాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో భారీ లిక్కర్ కుంభకోణం జరిగిందని పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ బంధువు సునీల్ రెడ్డి ద్వారా దుబాయ్‌కి రూ. 2 వేల కోట్ల విలువైన మద్యం, డబ్బులు తరలించారని ఆరోపించారు.