వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు(Ambati Rambabu) గుంటూరు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఇటీవల వైసీపీ నేతలపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ టీడీపీ, జనసేన సోషల్ మీడియా కార్యకర్తలపై పట్టాభిపురం పోలీసులకు అంబటి ఫిర్యాదు చేశారు. అయితే తన ఫిర్యాదుపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన తన అనుచరులతో కలిసి బుధవారం పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. ఎప్పటి లోపు చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే కొద్దిసేపటి తర్వాత పోలీసులు ఆయనను అక్కడి నుంచి పంపించేశారు.
ఈ నేపథ్యంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగిచారంటూ రాంబాబుపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయం చేయాలంటూ ధర్నా చేసిన తనపై కేసు నమోదు చేయడంపై అంబటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కాగా వైసీపీ ప్రభుత్వంలో అంబటి నీటిపారుదల మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. మంత్రిగా కంటే సంక్రాంతి పండుగకు తన డ్యాన్సుల ద్వారా ఆయన బాగా పాపులర్ అయ్యారు.