Roja| కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి వైసీపీ నేతలపై కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు నమోదయ్యాయి. తాజాగా వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజాపై పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. గతంలో రోజా మంత్రిగా ఉన్న సమయంలో బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్‌లో ఉద్యోగి మనోహర్‌తో చెప్పులు మోయించారు. ఈ ఘటనపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి ఉండటంతో ఎలాంటి ఫిర్యాదు అందలేదు.
తాజాగా కర్నూలులోని దళిత సంఘాలు కర్నూలు పోలీస్ స్టేషన్లో రోజాపై ఫిర్యాదు చేశారు. దళిత ఉద్యోగిని ఆమె అవమానించారని.. చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. కాగా ఇప్పటికే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌పై రోజా వ్యక్తిగత విమర్శలు చేశారంటూ కేసు నమోదైంది. అలాగే ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలోనూ రోజా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్లు సీఐడీ అధికారులకు ఫిర్యాదు అందింది. మరి ఇన్ని ఫిర్యాదుల నేపథ్యంలో రోజాను అరెస్ట్ చేస్తారో లేదో అనే ఉత్కంఠ వైసీపీ శ్రేణుల్లో మొదలైంది.