వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి (Posani Krishan Murali) ఊరట లభించింది. సీఐడీ నమోదుచేసిన కేసులో గుంటూరు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసాని అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఒకరోజు పోసానిని సీఐడీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. మరోసారి కస్టడీకి తీసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈలోపే పోసానికి బెయిల్ లభించింది.
కాగా ఈ కేసుకు సంబంధించి రాజంపేట, విజయవాడ, కర్నూలు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు చోట్ల నమోదైన కేసుల్లో ఆయనకు బెయిల్ లభించింది. తాజాగా సీఐడీ కేసులో కూడా బెయిల్ లభించడంతో పోసాని విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదైన నేపథ్యంలో అక్కడి పోలీసులు ఎవరైనా పీటీ వారెంట్‌తో వచ్చి అదుపులోకి తీసుకుంటే మాత్రం మళ్లీ జైలులోనే ఉండాలి. లేదంటే ఆయన విడుదలకు మార్గం సుగమం అవుతోంది.