గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’(Game Changer) ప్రీరిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫంక్షన్‌కు వచ్చి తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తీవ్ర సంతాపం తెలియజేశారు. మృతుల కుటుంబాలకు భారీ సాయం ప్రకటించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
“ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతి బాధాకరం . కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయింది. గత అయిదేళ్ళలో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు. పాడైపోయిన ఈ రోడ్డును బాగు చేస్తున్నారు. ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్నా ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన శ్రీ ఆరవ మణికంఠ, శ్రీ తోకాడ చరణ్ శనివారం రాత్రి ద్విచక్రవాహనంపై ఇళ్లకు వెళ్తున్నారు. బైక్ మీద వెళ్తున్న ఆ యువకులను వేగంగా వస్తున్న వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ యువకులు మృతి చెందారు. శ్రీ మణికంఠ, శ్రీ చరణ్ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. జనసేన పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తాము. ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించే ఏర్పాట్లు చేయాలని నా కార్యాలయ అధికారులకు స్పష్టం చేశాను. ఇక నుంచి పిఠాపురం నియోజక వర్గ పర్యటనలకు ఏడీబీ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించాలని నిర్ణయించుకున్నాను” అని పవన్ తెలిపారు. కాగా ఇంతకుముందుకు మృతుల కుటుంబాలకు నిర్మాత దిల్ రాజు రూ.5లక్షలు ప్రకటించిన సంగతి తెలిసిందే.