జమ్ముకశ్మీర్‌లోని పవాల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర నిఘా వర్గాలు దేశంలోని ప్రముఖ ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైన టీటీడీ(TTD) అధికారులు తిరుమల(Tirumala) తిరుపతిలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే తిరుమలలో క్యాబ్‌లు నడుపుతున్న 400 మంది డ్రైవర్లు, 50 మంది ఓనర్లతో టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి హర్షవర్ధన్ రాజు సమావేశమయ్యారు. ఆలయ పరిసరాల్లో అనుసరించాల్సిన విధానాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమల భద్రతలో డ్రైవర్లది కీలకమైన పాత్ర అని తెలిపారు. డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని ఆదేశించారు. నిషేధిత వస్తువులను తిరుమలకు తీసుకురాకూడదని, ఒకవేళ ఎవరైనా తీసుకొచ్చినట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా టాక్సీలు ఎక్కితే భద్రతా సిబ్బందికి చెప్పాలన్నారు. భక్తులు భద్రతా దృష్ట్యా ప్రతి ఒక్కరూ సైనికుడిలా పని చేయాలని పేర్కొన్నారు.