CM Chandrababu on investments: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాదిలోనే రూ.10 లక్షల కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో “స్వర్ణాంధ్రప్రదేశ్ – 2047” అనే లక్ష్యదిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ నేతృత్వంలో ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ నివేదికను సీఎం చంద్రబాబుకు న్యూఢిల్లీలో అందజేసింది. రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణపై టాస్క్‌ఫోర్స్ రూపొందించిన నివేదికలో అనేక కీలక సూచనలు ఉన్నాయి.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. “ఈ సంవత్సరం రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వచ్చే ఏడాది ₹13 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యాన్ని నిర్దేశించాం. సాంకేతికత ద్వారా పరిపాలనలో పారదర్శకతను తీసుకొస్తాం. డిజిటల్ పాలనతో ప్రజల అవసరాలను మరింత వేగంగా తీర్చగలుగుతాం.’’ అని అన్నారు. ఆగస్టు 15 నుంచి వాట్సాప్ ద్వారా పౌరసేవలు అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కుప్పం నుంచి డిజిటల్ హెల్త్ కార్డుల కార్యక్రమం ప్రారంభించబోతున్నామని చెప్పారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి నగరాలు వ్యాపారాలకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. విశాఖలో గూగుల్ పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. పేదరిక నిర్మూలన కోసం P-4 పాలసీ (People, Public, Private, Partnership) అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
టాటా నేతృత్వంలోని బృందం, రాష్ట్ర అభివృద్ధికి అనువైన రంగాలపై సుదీర్ఘంగా అధ్యయనం చేసి కొన్ని ప్రతిపాదనలు చేసింది. ముఖ్యంగా:
మెరుగైన మౌలిక సదుపాయాల అభివృద్ధి
ఆర్ధికంగా వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యం
యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు
డిజిటల్ గవర్నెన్స్‌లో నూతన అవకాశాలు
వంటివి ఈ నివేదికలో ప్రస్తావించారు.
చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను సంపన్న, సుస్థిర రాష్ట్రంగా మార్చే దిశగా వ్యూహాత్మకంగా పనిచేస్తోంది. పెట్టుబడుల సమీకరణ, వ్యాపారానికి అనుకూల వాతావరణం, సాంకేతికత ఆధారిత పాలన అనే మూడు ముఖ్య స్థంభాలపై దృష్టిసారిస్తోంది. ఈ ప్రణాళికలతో పాటు పౌరసేవలను వేగవంతం చేయడానికి కొత్త టెక్నాలజీని వినియోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టినట్టు సమాచారం.


