Gitam University White Coat: వైద్య వృత్తిలో రాణించాలంటే అంకితభావంతో పాటు సామాజిక బాధ్యతతో ఎదగాలని డాక్టర్ ఎన్‌టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ వి.రాధికా రెడ్డి అన్నారు. విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో నిర్వహించిన ‘జిమ్‌సర్’ ఈవెంట్‌లో 2025 బ్యాచ్ మెడిసిన్ విద్యార్థులకు వైట్‌కోట్ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ వి.రాధికా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగా చేరిన ఎంబీబీఎస్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు.

‘విద్యార్థులు స్వీయ ప్రతిభను పెంచుకోవాలి. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వంటి సాంకేతికను ఉపయోగించుకోవాలి. వైౖద్యరంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందుకు తగిన విధంగా జాతీయ వైద్య మండలి సంస్కరణల్ని తీసుకువచ్చింది. వైద్య విద్యార్థులు పుస్తకాలతో పాటు రోగిని, రోగ లక్షణాల్ని చదవడం నేర్చుకోవాలి. నిరంతర సాధన, మానవతా విలువలు, సమాజం పట్ల బాధ్యత ఉంటే వైద్య వృత్తిలో అగ్రస్థానానికి చేరుకోవచ్చు.’ అని రాధికా రెడ్డి అన్నారు.
తెల్లకోటు ప్రాధాన్యతను అర్థం చేసుకుని ఆ విలువలతో వైద్య వృత్తిలో ఎదగాలని పలువురు వైద్యులు సూచించారు. కాగా, గీతంలో 22 రాష్ట్రాలకు చెందిన వారు ఇక్కడ ప్రవేశాలు పొందారని.. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు స్కిల్ ల్యాబ్ ప్రారంభించామని చెప్పారు. అనంతరం కొత్త విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా తెల్ల కోటును అందజేశారు. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.


