Sunday, February 23, 2025
Homeఆంధ్రప్రదేశ్YS Sharmila: బొత్స వ్యాఖ్యలకు వైఎస్ షర్మిల కౌంటర్

YS Sharmila: బొత్స వ్యాఖ్యలకు వైఎస్ షర్మిల కౌంటర్

అసెంబ్లీకి వెళ్లడానికి వైసీపీ ఎమ్మెల్యేలకు ధైర్యం లేదన్న ఏపీసీసీ చీఫ్‌ షర్మిల(YS Sharmila) వ్యాఖ్యలపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) స్పందించిన సంగతి తెలిసిందే. పని లేకుండా ఖాళీగా కూర్చుని ట్వీట్‌లు పెట్టే షర్మిలకు తాము సమాధానం చెప్పాలా అని ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు షర్మిలకు కనిపించవని..ఎంతసేపు జగన్‌ను వ్యక్తిగతంగా విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. తాజాగా బొత్స వ్యాఖ్యలకు షర్మిల ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

- Advertisement -

“బొత్స సత్యనారాయణ గారి మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుంది. నమ్మి అధికారం ఇస్తే ఖాళీగా ఉన్నదెవరో.. పని చేయకుండా రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా దోచుకుతిన్నది ఎవరో… రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. 5 ఏళ్లు కుంభకర్ణుడి లెక్క నిద్ర పోయారు. అధికారం అనుభవిస్తూ ఖాళీగా కూర్చున్నారు. పార్టీ పాలసీకి, తండ్రి ఆశయాలకు విరుద్ధంగా బీజేపీకి దత్తపుత్రుడిగా మారారు. ప్రజల సంపదను ప్యాలెస్ కి మళ్లించుకున్నారు. 5 ఏళ్లు ఖాళీగా ఉండి ఎన్నికల ముందు సిద్ధం అంటూ బయటకు వచ్చారు. పని చేయకుండా ఖాళీగా ఉన్నారని తెలిసి ప్రజలు మిమ్మల్ని పనికి రాకుండా చేశారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. చివరికి ప్రతిపక్ష హోదా లేకుండా బుద్ధి చెప్పారు.

మిర్చి రైతుల కష్టాలపై మీకంటే ముందుగానే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కాంగ్రెస్ పార్టీ. రేట్ల హెచ్చుతగ్గులపై రైతు నష్టపోకుండా రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కేంద్రం నుంచి వెంటనే నిధులు తేవాలని అడిగింది కాంగ్రెస్ పార్టీ. సూపర్ సిక్స్ లో భాగంగా పెట్టుబడి సహాయం రూ.20 వేలు వెంటనే అందించాలని కోరింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి నెల కూటమి హామీలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీలో అడిగే అవకాశం కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి.. 11 సీట్లతో అసెంబ్లీకి వెళ్ళే అవకాశం మీకుంది కాబట్టి.. వైసీపీని శాసన సభకు వెళ్ళాలని డిమాండ్ చేశాం. రైతుల పట్ల కూటమి నిర్లక్ష్యాన్ని సభ వేదికగా ఎండగట్టాలని అడిగాం.

చంద్రబాబు గారి సూపర్ సిక్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూనే, వైసీపీ అసెంబ్లీకి వెళ్ళాలని కోరితే.. ప్రజల పక్షాన నిలబడాలని అడిగితే.. వ్యక్తిగత అజెండా అంటూ వైసీపీ నేతలు భుజాలు తడుముకోవడం హాస్యాస్పదం. సమాధానం చెప్పలేక దాటవేయడం మీ అవివేకానికి నిదర్శనం. మళ్ళీ మళ్ళీ వైసీపీనీ అడుగుతున్నాం. అసెంబ్లీకి వెళ్ళే అంశంపై మీ పాలసీ ఏంటో చెప్పండి. అసెంబ్లీకి వెళ్ళకపోతే వెంటనే రాజీనామాలు ప్రకటించండి. ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ లు పెట్టడానికి కాదు ప్రజలు మీకు ఓట్లు వేసింది. దమ్ముంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి.” అని డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News