Thursday, October 24, 2024
Homeఆంధ్రప్రదేశ్YS Jagan vs Sharmila: కోర్టుకెక్కిన వైఎస్ కుటుంబం.. జగనన్నా ఇంత అన్యాయమా అంటూ షర్మిల...

YS Jagan vs Sharmila: కోర్టుకెక్కిన వైఎస్ కుటుంబం.. జగనన్నా ఇంత అన్యాయమా అంటూ షర్మిల ఘాటు లేఖ

YS Jagan vs Sharmila| దివంగత సీఎం, మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YSR) కుటుంబంలో ఆస్తి తగాదాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే వైఎస్సార్ పిల్లలు జగన్(YS Jagan), షర్మిల(YS Sharmila) విడివిడిగా ఉంటున్నారు. ఆయన సతీమణి విజయమ్మ కుమార్తె షర్మిల వద్దే ఉంటున్నారు. రాజకీయంగా ఇద్దరు పిల్లలు వేరు వేరు పార్టీలకు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హంతకులకు తన సొంత అన్న జగన్ మద్దతుగా నిలవడంపై షర్మిల తీవ్రంగా విరుచుకుపడ్డారు. అలాగే సొంత చెల్లికి ఇవ్వాల్సిన ఆస్తిని ఇవ్వకుండా మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఊరువాడా తిరిగి ఎన్నికల ప్రచారం ప్రజల ముందు వాపోయారు. దీంతో ఆ ఎన్నికల్లో జగన్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చివరకు ఆయన సీఎం కుర్చీ నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఇంతటితో అన్నాచెల్లెలి యుద్ధానికి ముగింపు పలికిందని అందరూ భావించారు.

- Advertisement -

అయితే అసలు యుద్ధం ఇప్పుడే ప్రారంభమైందని తాజా పరిస్థితులు తెలియజేస్తున్నాయి. జగన్ ఏకంగా సొంత తల్లి విజయమ్మ(YS Vijayamma), చెల్లి షర్మిలపై కోర్టుకు ఎక్కారు. ఆస్తి పంపకాల విషయంలో విజయమ్మ, షర్మిలపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో జగన్ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటేడ్ షేర్ల వివాదంపై జగన్, ఆయన భార్య భారతి రెడ్డి పేర్లతో 5 పిటిషన్లు వేశారు. ఆగస్టు 21, 2019 ఎంవోయూ(MOU) ప్రకారం.. విజయమ్మ, షర్మిలకు షేర్లు కేటాయించామని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు షర్మిల తనకు రాజకీయ శత్రువుగా మారడంతో ఆ ఎంవోయూ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాని పిటిషన్‌లో తెలిపారు. ఈ పిటిషన్‌పై త్వరలోనే ట్రిబ్యునల్ విచారించనుంది. అయితే ఆస్తి వివాదంలో ఏకంగా తల్లి, చెల్లిపైనే జగన్ కోర్టుకు వెళ్లడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

జగన్ పిటిషన్‌పై ఆయన చెల్లి షర్మిల తీవ్రంగా స్పందిస్తూ ఓ సుదీర్ఘ లేఖ రాశారు. తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సంపాదించిన ఆస్తుల్లో తనకు, తన పిల్లలకు దక్కాల్సిన వాటా ఇవ్వకుండా జగన్‌ అన్యాయం చేశారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అరకొర ఆస్తులిచ్చి వెళ్లగొట్టాలని చూడటమే కాకుండా, ఆస్తుల పంపకానికి సంబంధించి తనతో చేసుకున్న ఒప్పందాన్ని కూడా తుంగలో తొక్కారని మండిపడ్డారు. ఏకంగా సొంత తల్లిపైనా, చెల్లిపైనా కేసు పెట్టి కుటుంబాన్ని కోర్టుకీడ్చేంత నీచానికి ఒడిగట్టారని వాపోయారు. ఆస్తుల పంపకాల కోసం జగన్‌తో పాటు కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని తనకు షరతు పెట్టడంపై ఆమె తీవ్రంగా ధ్వజమెత్తారు.

షర్మిల లేఖలోని సారాంశం..

“మీరు ఇటీవల నాకు రాసిన లేఖపై తీవ్ర అభ్యంతరం తెలియజేస్తున్నా. నాన్న రాజశేఖరరెడ్డి ఆయన జీవితకాలంలో మన కుటుంబవనరుల ద్వారా సంపాదించిన ఆస్తులన్నీ నలుగురు మనవలు, మనవరాళ్లకు సమానంగా చెందాలని విస్పష్టంగా ఆదేశించిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఆయన ఆదేశాల్ని శిరసావహిస్తానని అప్పట్లో మీరు అంగీకరించారు. ఆయన మరణించాక మీరు మాట తప్పారు. ఇచ్చిన హామీని తుంగలో తొక్కారు. భారతి సిమెంట్స్, సాక్షి పత్రికలతో పాటు తన జీవితకాలంలో సంపాదించిన ఆస్తులన్నీ తన నలుగురు మనవలు, మనవరాళ్లకు సమానంగా చెందాలని మన తండ్రి నిర్ద్వంద్వంగా ఆదేశించారు. ఆయన ఆదేశాలతో పాటు, ఇప్పటి వరకు మన మధ్య జరిగిన అన్ని చర్చలు, సంప్రదింపులు, ఒప్పందాలకు మన తల్లి విజయమ్మే సాక్షి. మీరు ‘ఎంతో ప్రేమానురాగాల’తో చేసిన అవగాహన ఒప్పందం(MOU)లో ప్రస్తావించిన ఆస్తుల వివరాలు మన తండ్రి ఇచ్చిన ఆదేశాల్ని పాక్షికంగా నెరవేర్చేలానే ఉన్నాయి.

భారతి సిమెంట్స్, సాక్షిల్లో మెజారిటీ వాటాలు మీరే ఉంచుకున్నారు. అందుకే ‘పాక్షికం’ అన్న మాటను ఒత్తి చెబుతున్నాను. కానీ మీరు బలవంతులవడం, మీదే పైచేయి కావడం, మీరనుకున్నది తప్ప ఎవరి మాటనూ లెక్క చేయని పరిస్థితి ఉండటంతో.. మీరు ఎంఓయూలో ప్రస్తావించిన అరకొర ఆస్తుల్ని తీసుకుని వివాదాన్ని పరిష్కరించుకునేందుకు అంగీకరించాను. తోడబుట్టిన అన్నయ్యతో వివాదాన్ని కొనసాగించడం, కుటుంబాన్ని రచ్చకెక్కించడం ఇష్టం లేక మన ఆస్తిలో సమాన వాటా పొందేందుకు నాకున్న హక్కును వదులుకునేందుకు అంగీకరించాను.

నాకు అరకొర ఆస్తులు మాత్రమే ఇచ్చేలా 2019 ఆగస్టు 31న కుదిరిన ఆ ఒప్పందాన్ని అమలు చేసేందుకు కూడా మీకు మనసు రావడం లేదు. ఎంఓయూ ప్రకారం మీ సొంత చెల్లెలు, ఆమె పిల్లలకు చెందాల్సిన ఆస్తుల్ని వారికి దక్కకుండా చేసేందుకు కంకణం కట్టుకున్నారు. దాని కోసం ఏకంగా సొంత తల్లిపైనే కేసు పెట్టే స్థాయికి దిగజారారు. మహోన్నతుడైన మన తండ్రి నడిచిన మార్గానికి మీరు ఎంత దూరంగా వెళుతున్నారో చూసి దిగ్భ్రాంతి చెందుతున్నాను. నాన్న ఆకాంక్షలకు, మీరు గతంలో ఇచ్చిన హామీకి తూట్లు పొడుస్తూ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేయాలని చూస్తున్నారు. మీరు రాసిన లేఖ చట్టప్రకారం.. ఆ ఒప్పందానికి విరుద్ధంగా ఉంది. మీరు ఆ లేఖ రాయడం వెనుక ఉన్న దురుద్దేశం నన్ను తీవ్రంగా బాధించింది. నాన్న ఎప్పుడూ కలలో కూడా ఊహించని పని మీరు చేశారు. ఆయన ఎంతో ప్రేమగా చూసుకున్న భార్యపైనా, కుమార్తెపైనా కేసులు పెట్టడంతో పాటు, ఆస్తిలో ఆయన కుటుంబానికి చట్టబద్ధంగా దక్కాల్సిన వాటాను ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు.

ys jagan

ఎంఓయూకి కాలం చెల్లదు. దానికి మీరు కట్టుబడాల్సిందే. మీరు దాన్ని ఏకపక్షంగా ఉపసంహరించుకోవడం చట్టప్రకారం కుదరదు. బెంగళూరులో 20 ఎకరాల్లో ఉన్న యలహంక ప్యాలెస్‌లో వాటాతో పాటు.. ఎంఓయూలో పేర్కొన్న ప్రతి అంశాన్నీ మీరు నెరవేర్చాల్సిందే. లేకపోతే మిమ్మల్ని చట్టప్రకారం బాధ్యుల్ని చేస్తాను. వాటన్నిటినీ మీరు ఎంఓయూలో పేర్కొనడంతో పాటు, మౌఖికంగానూ అంగీకరించారు. దానికి అమ్మే సాక్షి. నా రాజకీయ జీవితం నా ఇష్టం. నా వృత్తిపరమైన వ్యవహారశైలి ఎలా ఉండాలో నిర్దేశించే అధికారం మీకు లేదు. బహిరంగ వేదికలపై మీకు, ఎంపీ అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడకూడదన్న నిబంధనపై నన్ను సంతకం చేయమని కోరడం అసంబద్ధం. నాకు అరకొర ఆస్తులు మాత్రమే ఇస్తూ చేసుకున్న ఒప్పందంపై సెటిల్‌మెంట్‌కి అలాంటి అర్థంపర్థంలేని నిబంధన విధించడం సహేతుకం కాదు. ఈ పరిణామాలన్నింటికీ సాక్షిగా అమ్మ కూడా ఈ లేఖపై సంతకం చేసింది.” అంటూ షర్మిల లేఖలో వెల్లడించారు.

మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ఉన్నతమైన వైఎస్ కుటుంబం ఇలా ఆస్తుల పంపకాల కోసం రోడ్డున పడటం.. అందులోనూ కోర్టుకెక్కడం ప్రజల్లో తీవ్ర చర్చగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News