Tuesday, October 8, 2024
Homeట్రేడింగ్Davos: హైదరాబాద్ లో ఆరాజెన్ 2000 కోట్ల పెట్టుబడులు

Davos: హైదరాబాద్ లో ఆరాజెన్ 2000 కోట్ల పెట్టుబడులు

రేవంత్​ తో కంపెనీ సీఈవో మణి కంటిపూడి భేటీ

తెలంగాణలో ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ మరిన్ని పెట్టుబడులకు సిద్ధపడింది. రూ. 2,000 కోట్ల కొత్త పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 1,500 కొత్త ఉద్యోగాలను అందించేలా తమ ప్రాజెక్టులను విస్తరించనుంది. తెలంగాణలోని మల్లాపూర్‌లో ప్రస్తుతం ఉన్న సదుపాయాన్ని మరింత పెంచుకోవడానికి కొత్త పెట్టుబడులు పెడుతోంది. దీంతో ఆసియాలోనే ఔషధ పరిశ్రమకు హబ్ గా పేరొందిన హైదరాబాద్ స్థానం మరింత సుస్థిరమవనుంది. దావోస్​లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో భాగంగా ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ సీఈవో మణి కంటిపూడి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో భేటీ అయ్యారు.

- Advertisement -

ఫార్మా రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ హైదరాబాద్‌లో భారీ పెట్టుబడి ప్రణాళికలను ఎంచుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ కొత్త ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చేందుకు ఈ పెట్టుబడులు దోహదపడుతాయని అన్నారు. అద్భుతమైన మౌలిక సదుపాయాలు సిద్ధించటంతో పాటు భవిష్యత్తుకు అవసరమైన శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ ఏర్పడుతుందని అన్నారు. కొత్త ఆవిష్కరణలతో ఇక్కడున్న ప్రతిభా నైపుణ్యాలకు మరింత గుర్తింపు వస్తుందని సీఎం అన్నారు.

రాబోయే అయిదేండ్లలో తమ సేవలను విస్తరించే ప్రణాళికను ప్రకటించటం సంతోషంగా ఉందని కంపెనీ సీఈవో మణి కంటిపూడి అన్నారు. హైదరాబాద్‌లో రూ. 2,000 కోట్ల పెట్టుబడులకు నిర్ణయం తీసుకున్నామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కొత్త ఔషధ ఆవిష్కరణలు, పరిశోధన సంస్థల కేంద్రంగా హైదరాబాద్ జాతీయ స్థాయిలో తనకున్న హోదాను నిలబెట్టుకుంటుందనే విశ్వాసం కలుగుతోందన్నారు. తమ కంపెనీ విస్తరణకు తగినంత మద్దతు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ విస్తరణతో హైదరాబాద్ దేశంలోనే కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హబ్ గా మారనుంది. కొత్త డ్రగ్స్, డివైజ్‌లను కనుగొనేందుకు, అభివృద్ధి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా 1,000 మందికి పైగా ఆవిష్కర్తలకు హైదరాబాద్ సేవలందిస్తోంది. కొత్త ఔషదాల సృష్టి, అభివృద్ధి, తయారీ సేవల విభాగంలో ఆరాజెన్ కంపెనీకి 20 ఏళ్లకుపైగా అనుభవముంది. ఫార్మాస్యూటికల్‌, బయోటెక్నాలజీ రంగాలకు కాంట్రాక్ట్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్​మెంట్‌ సేవలను ఈ కంపెనీ అందిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News