Xpeng Flying Cars, Ahead Of Tesla: భవిష్యత్ రవాణా రంగంలో అమెరికా కంపెనీ టెస్లాకు చైనా గట్టి షాక్ ఇచ్చింది. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్లయింగ్ కార్ల (Flying Cars) ట్రయల్ ఉత్పత్తిని చైనాకు చెందిన Xpeng ఏరోహట్ కంపెనీ ఈ వారం ప్రారంభించింది. ఇది నెక్స్ట్ జనరేషన్ రవాణా వాణిజ్యీకరణలో ఒక మైలురాయిగా నిలవనుంది.
చైనాలోని గ్వాంగ్‌జౌలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఫ్లయింగ్ కార్ల ఇంటెలిజెంట్ ఫ్యాక్టరీలో ఈ ఉత్పత్తి మొదలైంది. Xpeng ఏరోహట్ అనేది చైనా ఎలక్ట్రిక్ వాహన తయారీదారు Xpeng అనుబంధ సంస్థ.
2026 నాటికి డెలివరీలు, 5,000 ఆర్డర్లు
Xpeng ఫ్లయింగ్ కార్ మోడల్ పేరు “ల్యాండ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్”. ఇది ఒక మాడ్యులర్ కారు. ఇందులో ఆరు చక్రాల గ్రౌండ్ వెహికల్ (“మదర్‌షిప్”), దాని నుండి విడదీయగలిగే ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ (eVTOL) ఉంటాయి. ఈ వాహనాన్ని సాధారణ లైసెన్స్‌తో పబ్లిక్ రోడ్లపై నడపవచ్చు, సాధారణ పార్కింగ్ స్థలాలలో పార్క్ చేయవచ్చు.
Xpeng తమ ఉత్పత్తి విడుదలైనప్పటి నుండి ఇప్పటికే 5,000 ఫ్లయింగ్ కార్ల ఆర్డర్‌లను పొందినట్లు సంచలన ప్రకటన చేసింది. 2026 నాటికి భారీ ఉత్పత్తి, డెలివరీలు ప్రారంభమవుతాయని తెలిపింది.
టెస్లా, అలెస్ సంస్థల పోటీ
ఈ రంగంలో టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ కూడా తన ఫ్లయింగ్ కార్ వెర్షన్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. “కొన్ని నెలల్లో” దీనిని ఆవిష్కరిస్తామని, ఇది “క్రేజీ టెక్నాలజీ” అని ఆయన ఇటీవల అన్నారు.
మరో యూఎస్ సంస్థ Alef ఏరోనాటిక్స్ ఇప్పటికే తన ఫ్లయింగ్ కార్ టెస్ట్ రన్‌లను ప్రదర్శించింది, తమకు ఇప్పటికే ఒక బిలియన్ డాలర్ల విలువైన ప్రీ-బుకింగ్ ఆర్డర్‌లు వచ్చాయని సీఈఓ జిమ్ దుఖోవ్నీ తెలిపారు.
అయితే, ఈ యూఎస్ కంపెనీల కంటే ముందే చైనాకు చెందిన Xpeng ట్రయల్ ఉత్పత్తిని ప్రారంభించడం ద్వారా ఫ్లయింగ్ కార్ల రేసులో ప్రస్తుతానికి ముందంజ వేసింది.
ALSO READ: Honda Elevate ADV Edition Launched: హోండా నుంచి స్పెషల్ కారు..ధర, ఫీచర్ల వివరాలివే!


