Post Office Services: భారత తపాలా శాఖ సెప్టెంబర్ 1 నుండి రిజిస్టర్డ్ పోస్ట్ సర్వీస్‌ను నిలిపివేయనుంది. 50 సంవత్సరాల శకానికి ముగింపు పలుకుతూ, భారత పోస్టల్ డిపార్ట్‌మెంట్ రిజిస్టర్డ్ పోస్ట్ సర్వీస్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1, 2025న స్పీడ్ పోస్ట్ సర్వీస్‌లో రిజిస్టర్డ్ పోస్ట్ సర్వీస్ ని విలీనం చేయనుంది.
50 సంవత్సరాలకు పైగా లక్షలాది మంది జీవితాల్లో కీలక పాత్ర పోషించే ఉద్యోగ ఆఫర్లు, లీగల్ నోటీసులు, ప్రభుత్వ ఉత్తరప్రత్యుత్తరాలు వంటి ముఖ్యమైన పత్రాలను చేరవేస్తూ రిజిస్టర్డ్ పోస్ట్ సర్వీస్ సేవలు అందించింది. గతంతో పోలిస్తే ప్రస్తుత కాలంలో రిజిస్టర్డ్ పోస్ట్ సర్వీస్ ఉపయోగంలో 25% తగ్గుదల కనిపించింది. దీంతో స్పీడ్ పోస్ట్ సర్వీస్ లో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Read more: https://teluguprabha.net/business/gold-and-silver-prices-across-the-country-are-continuing-to-remain-stable-at-over-rs-1-lakh-per-kg/
ఈ ప్రతిపాదనను సెప్టెంబర్ 1 నుండి అమలు చేయాలని పోస్టల్ శాఖ కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆదేశించారు. అన్ని విభాగాలు, కోర్టులు, విద్యా సంస్థలు మరియు వినియోగదారులు కొత్త వ్యవస్థకు మారాలని ఆదేశించారు. జూలై 31 నాటికి రిజిస్టర్డ్ పోస్ట్ అన్ని మార్గదర్శకాలను సవరించాలని తెలిపారు. ఈ విలీనం ద్వారా ట్రాకింగ్ ఖచ్చితత్వం, డెలివరీ వేగం, కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యమని తెలిపారు.
రిజిస్టర్డ్ పోస్ట్ ధరతో పోలిస్తే స్పీడ్ పోస్ట్ ధర 20-25% ఎక్కువగా ఉంటుంది. దీంతో సామాన్యులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రిజిస్టర్డ్ పోస్ట్ బ్రిటిష్ కాలంలో ప్రారంభమైంది. ప్రభుత్వ విభాగాలు, బ్యాంకులు, కోర్టులు, విద్యా సంస్థలు ఈ రిజిస్టర్డ్ పోస్టల్ వ్యవస్థను పూర్తిగా ఉపయోగించుకున్నాయి. ఈ రిజిస్టర్డ్ సర్వీస్ నమ్మకానికి చిహ్నంగా ఉండేది. ఇపుడు దీనిని స్పీడ్ పోస్ట్ సర్వీస్ తో విలీనం చేస్తున్నారు.
డిజిటల్ యుగంలో వినియోగదారుల అంచనాలను తీర్చడానికి ఈ మార్పు అవసరమని అధికారులు తెలిపారు. ప్రసుత కాలంలో ఈ-కామర్స్ సంస్థల రాకతో ప్రైవేట్ కొరియర్ కంపెనీలపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రజల అవసరాలకు తగినట్టుగా మారడం అవసరమని తపాలా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. 50 ఏళ్ల శకానికి తపాల శాఖ స్వస్థి పలుకుతుంది.


