Sunday, November 16, 2025
Homeబిజినెస్Bernstein Report : భారత కుబేరుల పెట్టుబడి రహస్యం.. 60% సంపద ఆ రెండు రంగాల్లోనే!

Bernstein Report : భారత కుబేరుల పెట్టుబడి రహస్యం.. 60% సంపద ఆ రెండు రంగాల్లోనే!

Investment habits of India’s rich : భారత్‌లోని అపర కుబేరులు తమ డబ్బును ఎక్కడ దాస్తారు? వారి పెట్టుబడి మంత్రం ఏమిటి..? వేల కోట్ల సంపదను ఏయే రంగాల్లో మదుపు చేసి మరింత పెంచుకుంటున్నారు..? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఆస్తుల నిర్వహణ సంస్థ ‘బెర్న్‌స్టీన్’ (Bernstein) భారత శ్రీమంతుల పెట్టుబడి రహస్యాలను విప్పింది. దేశ జనాభాలో కేవలం ఒక శాతం ఉన్న అత్యంత ధనవంతులు (ఉబెర్ రిచ్), దేశ సంపదలో ఎక్కువ భాగాన్ని తమ ఆధీనంలో ఉంచుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇంతకీ ఎవరీ ఉబెర్ రిచ్..? వారి పెట్టుబడుల్లో 60 శాతం కేవలం రెండు రంగాల్లోనే ఎందుకు కేంద్రీకృతమైంది..? ఆసక్తికర వివరాలతో కూడిన ఈ నివేదిక ఏం చెబుతోందో చూద్దాం.

- Advertisement -

ఎవరీ ‘ఉబెర్ రిచ్’ : ‘ఉబెర్ రిచ్’… ఈ పదం వినడానికి కొత్తగా ఉన్నా, అత్యంత సంపన్నులను ఉద్దేశించి వాడతారు. ‘ఉబెర్’ అనేది ఒక జర్మన్ పదం. దీనికి ‘అతిగా’ లేదా ‘అవసరమైన దానికంటే ఎక్కువ’ అని అర్థం. అంటే, ఊహకు అందని రీతిలో సంపద కలిగిన వారిని ‘ఉబెర్ రిచ్’ అని పిలుస్తారు. అల్ట్రా హై నెట్‌వర్త్ వ్యక్తులు (UHNI), హై నెట్‌వర్త్ వ్యక్తులు (HNI) ఈ కేటగిరీ కిందకు వస్తారు.

దేశ సంపదలో 59% వీరిదే : బెర్న్‌స్టీన్ నివేదిక ప్రకారం, భారత దేశ మొత్తం సంపదలో దాదాపు 59 శాతం కేవలం ఈ 1 శాతం ఉబెర్ రిచ్ వ్యక్తుల చేతుల్లోనే ఉంది. మన దేశ మొత్తం సంపద విలువ 19.6 ట్రిలియన్ డాలర్లు కాగా, ఇందులో ఏకంగా 11.6 ట్రిలియన్ డాలర్ల (దాదాపు రూ. 965 లక్షల కోట్లు) సంపద ఈ శ్రీమంతుల వద్దే పోగుపడి ఉండటం గమనార్హం.
ఆ రెండు రంగాలే హాట్ ఫేవరేట్.

భారత్‌లోని ఈ అత్యంత సంపన్నులు తమ పెట్టుబడుల విషయంలో ఒక స్పష్టమైన ఫార్ములాను అనుసరిస్తున్నట్లు నివేదిక తేల్చింది. వీరి మొత్తం సంపదలో దాదాపు 60 శాతాన్ని ప్రధానంగా రెండు రంగాల్లోనే పెట్టుబడిగా పెడుతున్నారు. ఆ హాట్ ఫేవరేట్ ఆప్షన్లు మరేవో కాదు.. రియల్ ఎస్టేట్ (స్థిరాస్తి) మరియు బంగారం.

నివేదిక ప్రకారం, భారత్‌లో ఉన్న 11.6 ట్రిలియన్ డాలర్ల ఉబెర్ రిచ్ సంపదలో ఎక్కువ భాగం భౌతిక ఆస్తుల రూపంలోనే ఉంది. షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా, బ్యాంకు డిపాజిట్లు వంటి ఆర్థిక ఆస్తులు కేవలం 2.7 ట్రిలియన్ డాలర్ల మేరకే వెల్త్ మేనేజర్ల పర్యవేక్షణలో ఉన్నాయి. మిగిలిన 8.9 ట్రిలియన్ డాలర్ల విలువైన భారీ సంపదంతా భూములు, బహుళ అంతస్తుల భవనాలు, బంగారం, ప్రమోటర్ ఈక్విటీ వంటి రూపాల్లో ఉంది. ఈ కారణంగానే ఈ ఆస్తులు వెల్త్ మేనేజర్ల పరిధిలోకి రావడం లేదని బెర్న్‌స్టీన్ విశ్లేషించింది.

నివేదికలోని మరికొన్ని కీలక అంశాలు: భారత్‌లో సుమారు 35,000 మంది అల్ట్రా హై నెట్‌వర్త్ వ్యక్తులు (UHNI) ఉన్నారు. వీరి సగటు నికర ఆస్తి విలువ 12 మిలియన్ డాలర్లకు పైమాటే. ఈ UHNI కుటుంబాల సగటు వార్షిక ఆదాయం 4.8 మిలియన్ డాలర్లు. వీరి సగటు ఆస్తుల విలువ 54 మిలియన్ డాలర్లు ఉన్నప్పటికీ, అందులో ఆర్థిక ఆస్తుల వాటా కేవలం 24 మిలియన్ డాలర్లు మాత్రమే కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad