PM SVANidhi scheme : స్వాతంత్య్ర దినోత్సవ వేళ ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించిన ‘పీఎం స్వానిధి’ పథకం ఇప్పుడు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కరోనా మహమ్మారి దెబ్బకు వీధిన పడిన అసంఖ్యాక చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపిన ఈ పథకం ఎందరికో ఆపన్న హస్తం అందించింది. బండి మీద పండ్లు అమ్ముకునే సామాన్యుడి నుంచి, చెప్పులు కుట్టుకునే శ్రామికుడి వరకు ప్రతి ఒక్కరికీ ఆర్థికంగా అండగా నిలిచింది. అసలు ఏమిటీ స్వానిధి..? పూచీకత్తు లేకుండానే పదివేల రూపాయల రుణం ఎలా వస్తుంది..? ఎవరు అర్హులు..? దరఖాస్తు ప్రక్రియ ఎలా.?
పీఎం స్వానిధి: ‘ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి’ పథకం. కేంద్ర ప్రభుత్వం 2020 జూన్ 1న దీన్ని ప్రారంభించింది. కరోనా లాక్‌డౌన్‌ల కారణంగా జీవనోపాధి కోల్పోయి, తిరిగి వ్యాపారం ప్రారంభించడానికి పెట్టుబడి లేక ఇబ్బంది పడుతున్న పట్టణ ప్రాంత వీధి వ్యాపారులకు చేయూతనివ్వడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దీని కింద ఎలాంటి గ్యారెంటీ అవసరం లేకుండానే వర్కింగ్ క్యాపిటల్ లోన్ అందిస్తారు.
ఎవరెవరు అర్హులు : పట్టణ ప్రాంతాల్లో వీధులు, ఫుట్‌పాత్‌లపై బండ్లు పెట్టుకుని లేదా తలపై గంపలో సరుకులు పెట్టుకుని వ్యాపారం చేసుకునే వారందరూ ఈ పథకానికి అర్హులే.
ఉదాహరణకు: కూరగాయలు, పండ్లు, పూలు అమ్మేవారు. టిఫిన్ సెంటర్లు, టీ బండ్లు నడిపేవారు, బట్టలు, చెప్పులు, పుస్తకాలు వంటివి విక్రయించేవారు. చెప్పులు కుట్టేవారు (మోచీ), పాన్ షాపుల వారు, లాండ్రీ సేవలు అందించేవారు.
పథకం ప్రయోజనాలు.. రుణ ప్రక్రియ ఎలా : ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులకు ఎన్నో ప్రయోజనాలున్నాయి.
పూచీకత్తు లేదు: ఈ రుణం కోసం ఎలాంటి ఆస్తి పత్రాలు గానీ, ఇతరుల గ్యారెంటీ గానీ అవసరం లేదు.
విడతల వారీగా రుణం: తొలి విడతగా రూ.10,000 రుణం ఇస్తారు. దీనిని 12 నెలల్లో సకాలంలో చెల్లిస్తే, రెండో విడతగా రూ.20,000, మూడో విడతగా రూ.50,000 వరకు రుణం పొందే అర్హత లభిస్తుంది.
ప్రాసెసింగ్ ఫీజు లేదు: రుణం మంజూరు చేసేటప్పుడు బ్యాంకులు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయవు. దరఖాస్తు చేసుకున్న మొత్తం చేతికి అందుతుంది.
వడ్డీ రాయితీ: ఈ రుణంపై విధించే 7 శాతం వార్షిక వడ్డీకి సంబంధించిన రాయితీని ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది.
దరఖాస్తు చేసుకోవడం ఎలా : ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం. మీ దగ్గరలోని ఏదైనా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు, లేదా మీ-సేవ కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఆన్‌లైన్‌లో మీరే స్వయంగా చేసుకోవచ్చు. ముందుగా అధికారిక వెబ్‌సైట్https://pmsvanidhi.mohua.gov.in/ ను సందర్శించాలి. వెబ్‌సైట్‌లో ‘Apply for Loan’ ఆప్షన్‌ను ఎంచుకుని మీ మొబైల్ నంబర్, ఆధార్ వివరాలతో లాగిన్ అవ్వాలి.
దరఖాస్తు ఫారంలో మీ వ్యక్తిగత, వ్యాపార వివరాలను జాగ్రత్తగా నింపాలి. ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, బ్యాంకు పాస్‌బుక్ వంటి అవసరమైన పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
మీకు సమీపంలో ఉన్న బ్యాంకును ఎంపిక చేసుకుని దరఖాస్తును సమర్పించాలి.
మీ దరఖాస్తును బ్యాంకు అధికారులు పరిశీలించి, అర్హత నిర్ధారించుకున్న తర్వాత 7 నుంచి 10 పని దినాల్లోపు రుణాన్ని నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. అర్హులైన ప్రతి చిరు వ్యాపారి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ వ్యాపారాలను నిలబెట్టుకోవచ్చు.


