Aamir Khan : బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్‌పై అతని సోదరుడు ఫైసల్ ఖాన్ చేసిన సంచలన ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అమీర్ తనను ఏడాది పాటు ఒక గదిలో బంధించాడని, తన మానసిక ఆరోగ్యంపై తప్పుడు ఆరోపణలు చేశాడని ఫైసల్ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నేళ్ల క్రితం జరిగిన ఈ సంఘటనను ఫైసల్ తాజాగా గుర్తు చేసుకున్నారు.
ఫైసల్ మాట్లాడుతూ, “నాకు మానసిక వ్యాధి ఉందని, నేను సమాజానికి హాని చేసే పిచ్చివాడినని ముద్ర వేశారు. కొన్ని విషయాల్లో నేను కుటుంబానికి సహకరించకపోవడంతో వారు నన్ను పిచ్చివాడిగా భావించారు. నేను వారి ఉచ్చులో చిక్కుకుపోయానని తర్వాత అర్థమైంది. ఆ స్థితి నుంచి బయటపడటం నాకు తెలియలేదు. అమీర్ నన్ను ఏడాది పాటు ఒక గదిలో బంధించాడు. నా ఫోన్‌ను లాగేసుకున్నారు, బయటకు వెళ్లనివ్వలేదు. నా గది బయట బాడీగార్డ్‌లను పెట్టారు. నాకు మందులు ఇచ్చేవారు. నా తండ్రి నన్ను కాపాడతాడని అనుకున్నాను, కానీ ఆయన్ని సంప్రదించే మార్గం నాకు తెలియలేదు” అని వాపోయారు.
సంవత్సరం తర్వాత అమీర్ తనను వేరే ఇంటికి మార్చినట్లు ఫైసల్ తెలిపారు. అమీర్, ఫైసల్ మధ్య విభేదాలు ఎన్నో రోజులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఫైసల్ చట్టపరమైన పోరాటం చేస్తున్నారు. తన ఆస్తి విషయంలో కోర్టును ఆశ్రయించారు. గతంలో ఫైసల్ ఒక ఆసుపత్రిలో మానసిక ఆరోగ్య చికిత్స తీసుకున్నారు. 20 రోజుల చికిత్స అనంతరం తాను పూర్తిగా కోలుకున్నానని, అయినప్పటికీ అమీర్ తనను బంధించాడని ఆరోపించారు.
సినీ నేపథ్యం
అమీర్ ఖాన్, ఫైసల్ ఖాన్ కలిసి ‘మేళ’ అనే బాలీవుడ్ చిత్రంలో నటించారు. ధర్మేశ్ దర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2000లో విడుదలైంది. ఫైసల్ 1988లో విలన్ పాత్రతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. 1990లో తన తండ్రి నటించిన ‘తుమ్ మేరే హో’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 1994లో ‘మధోశ్’, 2015లో ‘చినార్ దాస్తాన్ ఏ ఇష్క్’ వంటి చిత్రాల్లో నటించారు.


