బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ చాలా వెరైటీ యాక్టర్. కామెడీ మొదలు, యాక్షన్, మల్టీ స్టారర్, లవ్ స్టోరీలు ఇలా అన్ని జానర్ సినిమాలు తీసే హీరోగా ఈయనకు మార్కెట్ ఉంది. లేడీ ఫాలోయింగ్ ఇప్పటికీ తగ్గలేదు అక్షయ్ కు. ఇక సోషియల్ రెస్పాన్సిబిలిటీ అంటూ ఎప్పుడో ఏదో ఒక డొనేషన్ ఇవ్వటం లేదా చారిటీ ప్రోగ్రాంలో పాల్గొనటం, రాజకీయాలపై కుండబద్ధలు కొట్టినట్టు తన అభిప్రాయం చెప్పటం ఇవన్నీ ఖిలాడీ అక్షయ్ కు బాగా రొటీన్. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటారు.
‘కెనడా కుమార్’ అని ప్రజలు తనను ట్రోల్ చేస్తారని అక్షయ్ కుమార్ బాహాటంగానే అంగీకరిస్తారు. అయితే ‘ఖాన్ ల త్రయ’మైన అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారూఖ్ తర్వాత అక్షయ్ కుమార్ తన హీరో ఇమేజ్ ను చాలా విజయవంతంగా కొనసాగిస్తున్నారు. అక్షయ్ ఓ ఫక్తు కమర్షియల్ హీరో అనుకుంటే మీరు పొరపడ్డట్టే, ‘ప్యాడ్ మాన్’ వంటి ఆర్ట్ సినిమాల్లో ఈయన నటించి తనకు ఎలాంటి భేషజాలు లేవని చేతల్లో చాటుకున్నారు.
వ్యక్తిగత జీవితంలో పార్టీలకు దూరంగా, చాలా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని, ఫిట్నెస్ ఫ్రీక్ రొటీన్ ను అత్యంత కఠినంగా కొనసాగిస్తున్న అక్షయ్ ఒకప్పుడు ‘ప్లే బాయ్’ గా బాలీవుడ్ లో వెలిగారు. అఫైర్స్, బ్రేకప్ ఇలా చాలానే ఉన్నాయి అక్షయ్ తెరవెనుక కథలు. కానీ పెళ్లాయ్యాక, పిల్లల తండ్రి అయ్యాక ఆయన తన లైఫ్ స్టైల్ ను రీ డిజైన్ చేసుకోవటం హైలైట్. ఏడాదంతా బిజీ హీరోగా ఉండే అక్షయ్ సినిమాలు రెగ్యులర్ గా రిలీజ్ అవుతూనే ఉంటాయి. బాలీవుడ్ లో టాప్ 10 హయ్యస్ట్ పెయిడ్ హీరోల్లో అక్షయ్ కుమార్ పేరు తప్పకుండా ఉంటుంది.
ఓవైపు టీవీ ప్రోగ్రామ్స్, మరోవైపు సినిమా ప్రమోషన్స్ ఇవన్నీ చాలక ఎండార్స్మెంట్స్ ..ఇది అక్షయ్ లైఫ్. ఇక సినిమా ఏదైనా ఆయన తన షెడ్యూల్స్ ను చాలా అంకితభావంతో శరవేగంగా షూట్ చేసేస్తారనే పేరుంది ఇండస్ట్రీలో. సినిమాలను సాధారణంగా 40-60 రోజుల్లో ఆయన రాపప్ చేసేస్తారు. అదే మిగతా నటులైతే కనీసం ఏడాదిలో 6-12 నెలలపాటు పనిచేస్తారు. అందుకే అక్షయ్ సినిమాలు ఏటా కనీసం 6కు తగ్గకుండా రిలీజ్ అవుతూనే ఉంటాయి. హిట్లు, ఫ్లాపులతో పనిలేకుండా ఆయన పనిచేస్తుంటారు.
ఏటా 6-8 సినిమాలు అక్షయ్ కుమార్ వి రిలీజ్ అవుతంటాయి. ఈ ఏడాది అంటే 2023లో ఏకంగా 10 సినిమాలు రిలీజ్ కు క్యూ కట్టాయి. ఇది అక్షయ్ కెరీర్ ఎంత పీక్స్ లో ఉందో చెప్పేందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఖిలాడీ సిరీస్ సినిమాల్లో యాక్ట్ చేసినందుకు ఆయన్ను ఖిలాడీ అక్షయ్ అంటుంటారు. నిజంగానే రీల్ లైఫ్ మాత్రమే కాదు.. రియల్ లైఫ్ లోనూ అక్షయ్ ఖిలాడీనే అనిపించుకుంటున్నారు.
‘సెల్ఫీ’ అనే బాలీవుడ్ సినిమాలో ఇమ్రాన్ హష్మీతో కలిసి ఈయన నటిస్తున్నారు. ఈనెల 24న సెల్ఫీ సినిమా రిలీజ్ కానుంది. మరాఠీ సినిమాలో తొలి ప్రయత్నంగా ఈయన ‘వేదాట్ మరాఠే వీర్ దౌడ్లే సాత్’ అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఛత్రపతి శివాజీగా ఈయన కనిపిస్తున్నారు. దీపావళికి ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలున్నాయి. ‘ఓఎంజీ’కి సీక్వెల్ గా ‘ఓఎంజీ-2’ రిలీజ్ అవుతోంది. ఆతరువాత ‘కాప్సూల్ గిల్’ అనే సినిమా అడిషనల్ చీఫ్ మైనింగ్ ఇంజినీర్ జస్వంత్ సింగ్ గిల్ బయోపిక్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. మరో బయోపిక్ సూర్య నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ హిందీ రీమేక్ లో అక్షయ్ హీరోగా వస్తున్నారు. అమితాబ్-గోవిందా హిట్ సినిమా ‘బడే మియా ఛోటే మియా’ సీక్వెల్ లో టైగర్ ష్రాఫ్ తో కలిసి వస్తున్నారు అక్షయ్. ఈ సినిమా డిసెంబర్ 22కి రిలీజ్ అవ్వనుంది.
రోహిత్ షెట్టి ‘సింగం’ సీక్వెల్ లో ‘సింగం ఎగైన్’ అంటూ కాప్ యూనివర్స్ యాక్షన్ మూవీతో వస్తున్నారు. కామెడీ సినిమా ‘ఖేల్ ఖేల్ మే’ సినిమాలోనూ ఈయన లీడ్ హీరో. మరో పీరియడ్ డ్రామా ‘సీ శంకరన్ నాయర్’ అనే సినిమాలో హీరో మాధవన్ తో కలిసి మెరవనున్నారు అక్షయ్. కామెడీ హిట్ సీక్వెల్ ‘హౌస్ ఫుల్’ లోనూ అక్షయ్ మురిపించనున్నారు. ‘హౌస్ ఫుల్-5’లో అభిషేక్ బచ్చన్, రితేష్ దేశ్ ముఖ్, బాబీ డియోల్, చంకీ పాండేతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు అక్షయ్.
మొత్తానికి ఇలా అన్ని సబ్జెక్టులపై సినిమాలు చేస్తూ, మరోవైపు గెస్ట్ అప్పియరెన్సులు, మల్టీ స్టారర్, సోలో హీరో, సౌత్ సినిమాల్లో విలన్ గా యాక్ట్ చేస్తున్న అక్షయ్ కుమార్ రియల్ ఎంటర్ టైనర్ గా అందరినీ అలరిస్తున్నారు.