Anchor Shyamala Bus Accident Case : ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో యాంకర్ శ్యామలపై పోలీస్ కేసు నమోదైంది. వైసీపీ అధికారిక X (ట్విటర్) పేజీ నిర్వాహకులతో కలిపి మొత్తం 27 మందిని నిందితులుగా ఈ లిస్ట్ లో చేర్చారు.
ALSO READ: AP: ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ ఉక్కుపాదం: గ్యారేజీలకే పరిమితమైన 600 బస్సులు
అక్టోబర్ 24న హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు కల్లూరు మండలం చిన్నటేకూరులో దగ్ధమై 19 మంది మరణించారు. ఈ ప్రమాదాన్ని ప్రభుత్య బెల్ట్ షాపులు, కల్తీ మద్యం వల్ల జరిగిందని వైసీపీ నేతలు ప్రచారం చేయడమే ఈ కేసుకు ప్రధాన కారణం. ఈ తప్పుడు ప్రచారంపై కర్నూలు మండలం బి. తాండ్రపాడుకు చెందిన పేరపోగు వెనుములయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కర్నూలు తాలూకా అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రమాద వివరాల – అక్టోబర్ 24 తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద దగ్ధమైంది. 19 మంది సజీవ దహనమై మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసు దర్యాప్తులో, మద్యం మత్తులో శివశంకర్ అనే యువకుడు నడిపిన బైక్ డివైడర్‌ను ఢీకొని అక్కడికక్కడే మరణించాడని తేలింది. అదే బైక్‌పై ఉన్న అతని స్నేహితుడు ఎర్రి స్వామి పోలీసులకు కీలక సమాచారం ఇచ్చాడు. తామిద్దరూ మద్యం సేవించామని, ప్రమాదం తర్వాత రోడ్డుపై పడి ఉన్న శివశంకర్ మృతదేహాన్ని పక్కకు తీసే ప్రయత్నంలో ఉండగా, రహదారిపై ఉన్న బైక్‌ను కావేరి బస్సు వేగంగా ఢీకొని ఈడ్చుకెళ్లిందని, దానివల్లే మంటలు చెలరేగాయని వివరించాడు. ఈ వాంగ్మూలానికి మద్దతుగా, శివశంకర్ పెట్రోల్ బంక్‌లో ఆయిల్ కొట్టించిన సీసీ ఫుటేజ్‌ను కూడా పోలీసులు విడుదల చేశారు.
పోలీసుల దర్యాప్తు వాస్తవాలు ఇలా ఉండగా, దీనిని ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరిస్తూ కల్తీ మద్యానికి ముడిపెట్టి ప్రచారం చేశారన్న ఫిర్యాదు మేరకు పోలీసులు తాజాగా యాంకర్ శ్యామల, తదితర వైసీపీ నేతలపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వైసీపీ నేతలు “ప్రభుత్య బెల్ట్ షాపులు, కల్తీ మద్యం వల్లే ప్రమాదం” అని ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో భయం, అస్తవ్యస్తత కలిగించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.


