Annapurna Studios 50th Anniversary : తెలుగు సినిమా ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన అద్భుత కళల సౌధం, అన్నపూర్ణ స్టూడియోస్. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు దార్శనికతతో, ఓ బీడు భూమిలో పురుడుపోసుకున్న ఈ స్టూడియోకి నేటితో 50 వసంతాలు పూర్తయ్యాయి. 1975, ఆగస్టు 13న వేసిన ఆ పునాది రాయి, తెలుగు చిత్రసీమను చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలించడంలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని అన్నపూర్ణ స్టూడియోస్ పంచుకున్న కొన్ని అపురూప చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, శంకుస్థాపన చేస్తున్న ఓ చిన్నారి ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ, ఆ ఫొటోలో ఏఎన్నార్ గారి సతీమణి ఎత్తుకున్న ఆ చిన్నారి నేటి మన హీరోలలో ఒకరని మీకు తెలుసా..?
చెన్నై నుంచి హైదరాబాద్‌కు.. ఓ మహా ప్రస్థానం: ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ కార్యకలాపాలన్నీ చెన్నై (అప్పటి మద్రాసు) కేంద్రంగానే జరిగేవి. అయితే, మన సినిమాకు మన గడ్డపైనే ఓ అడ్డా ఉండాలని తలచిన అతికొద్ది మందిలో అక్కినేని నాగేశ్వరరావు అగ్రగణ్యులు. ఆయన సంకల్పం, ముందుచూపుతో హైదరాబాద్‌లో తెలుగు సినిమాకు ఒక శాశ్వత చిరునామా ఏర్పాటు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అప్పటికి జూబ్లీహిల్స్ ప్రాంతమంతా కొండలు, గుట్టలతో నిండిన బీడు భూమి. సరైన రహదారి సౌకర్యం కూడా లేని ఆ ప్రదేశంలో, ఓ సినీ సామ్రాజ్యాన్ని నిర్మించాలని ఏఎన్నార్ కలలు కన్నారు.
పునాది నుంచి సినీ సౌధం వరకు: ఏఎన్నార్ సంకల్పానికి ప్రతిరూపంగా, 1975 ఆగస్టు 13న ఆయన తన భార్య అన్నపూర్ణ పేరు మీద స్టూడియో నిర్మాణానికి పునాది రాయి వేశారు. ఈ చారిత్రక ఘట్టానికి గుర్తుగా అన్నపూర్ణ స్టూడియోస్ యాజమాన్యం పంచుకున్న ఫోటోలో, ఏఎన్నార్ సతీమణి అన్నపూర్ణమ్మ గారు ఓ చిన్నారి మనవడిని ఎత్తుకుని శంకుస్థాపన చేయించారు. ఆ చిన్నారి మరెవరో కాదు, నేటితరం కథానాయకుడు అక్కినేని సుమంత్. ఆనాటి ఈ సంఘటన, అక్కినేని కుటుంబానికి ఈ స్టూడియోతో ఉన్న అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది.
ఈ శంకుస్థాపన జరిగిన కొద్ది నెలల్లోనే, 1976 జనవరి 14న అప్పటి భారత రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ చేతుల మీదుగా స్టూడియో అధికారికంగా ప్రారంభమైంది. రాళ్ళూరప్పలతో ఉన్న ఆ ప్రాంతం, అక్కినేని కృషితో నేడు వేలాది మందికి ఉపాధినిచ్చే, వందలాది చిత్రాలకు వేదికగా నిలిచే ఓ సృజనాత్మక కేంద్రంగా రూపుదిద్దుకుంది.
50 ఏళ్ల ప్రస్థానం.. భవిష్యత్తుకు దిక్సూచి:
గ గ డిచిన 50 ఏళ్లలో అన్నపూర్ణ స్టూడియోస్ ఎన్నో చారిత్రాత్మక చిత్రాలకు వేదికైంది. అన్నపూర్ణ స్టూడియోస్ స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా, అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాను ఏర్పాటు చేసి భావి తరానికి సినిమా తయారీలో శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా నాగర్జున నటించిన సూపర్ హిట్ సినిమా ‘శివ’ ను 4కె విజువల్స్, రీమాస్టర్డ్ సౌండ్ తో మళ్లీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏఎన్నార్ ఆశయాలకు అనుగుణంగా, ఆయన వారసులు నాగార్జున, అమల, నాగచైతన్య, సుప్రియ యాజమాన్యంలో ఈ సంస్థ తెలుగు సినిమా అభివృద్ధికి తన వంతు పాత్ర పోషిస్తూనే ఉంది.


