హైదరాబాద్ లో రాంగోపాల్ వర్మ ఇంటి వద్ద హైడ్రామా కొనసాగుతోంది. ఆయన్ని అరెస్టు చేసేందుకు ఏపీ పోలీసులు జూబిలీహిల్స్ లోని ఆర్జీవీ (RGV) ఇంటివద్దకి చేరుకున్నారు. రాంగోపాల్ వర్మ ఈరోజు మద్దిపాడు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ విచారణకి డుమ్మా కొట్టడంతో పోలీసులే ఆర్జీవీ కోసం హైదరాబాద్ కి వచ్చారు. దీంతో ఆర్జీవీ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి సోషల్ మీడియాలో RGV పెట్టిన పోస్టులు వివాదానికి తెరతీశాయి. ఆర్జీవీ తీవ్ర అభ్యంతరకర పోస్ట్‌లు పెట్టారని, వారి వ్యక్తిత్వాలను కించపరిచేలా పోస్ట్‌లు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులను ఆశ్రయించారు. వ్యూహం సినిమా పోస్టర్లలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ల మార్ఫింగ్ ఫోటోలు అసభ్యకరంగా వాడారని ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆర్‌జీవీకి నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని పేర్కొన్నారు.
తొలుత నవంబర్ 19న విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ వర్మ వెళ్లలేదు. నాలుగు రోజుల సమయం కోరుతూ ఒంగోలు పోలీసులకు వాట్సప్‌లో మెసేజ్ పెట్టారు. సినిమా బిజీలో ఉండటం వల్ల రాలేకపోతున్నానని వివరించాడు. ఆ నాలుగు రోజుల తర్వాత ఇప్పుడు కూడా విచారణకు అటెండ్ అవ్వకపోవడంతో RGV ని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు రెడీ అయ్యారు.