నటీనటులు: బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్, హైపర్ ఆది, మకర్ దేశ్ పాండే, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ అయ్యంగార్, సుదర్శన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: చిన్మయ్ సలాస్కర్
మ్యూజిక్: చైతన్య భరద్వాజ్
ఎడిటర్: నిరంజన్
నిర్మాత: సాహు గారపాటి
దర్శకత్వం: కౌశిక్ పెగళ్లపాటి
కమర్షియల్ సినిమాలనే చేస్తూ వచ్చిన యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన తొలి హారర్ జోనర్ మూవీ ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. ఇద్దరికీ హిట్ అవసరమే. రాక్షసుడు వంటి సక్సెస్‌ఫుల్ మూవీ తర్వాత ఇద్దరూ కలిసి నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఆసక్తిని కలిగించాయి. మరి సినిమా ఆడియెన్స్‌ను అలరించిందా?.. లేదా? అనే విషయాలు తెలియాలంటే ముందు కథలోకి వెళదాం..
కథ:
Kishkindhapuri Review: రాఘవ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్) ఘోస్ట్ వాకింగ్ పేరుతో హంటెడ్ హౌసెస్ నిర్వహిస్తుంటాడు. థ్రిల్ కావాలని కోరుకునే వారికి థ్రిల్‌ను అందించటమే ఈ టూర్ ఉద్దేశం. రాఘవ్‌కి స్నేహితుడు (సుదర్శన్) ఈ టూర్ విషయంలో సాయపడుతుంటాడు. రాఘవ్ ప్రేయసి మైథిలి (అనుపమ పరమేశ్వరన్). ఓసారి ఇలాంటి హంటెడ్ హౌసెస్ టూర్‌లో భాగంగా కిష్కింధపురి అనే గ్రామంలోని సువర్ణమాయ అనే రేడియో స్టేషన్‌కి వెళతారు. అక్కడ ఉన్న ప్రేతాత్మ వేదవతి ఇంట్లోకి అడుగు పెట్టిన 11 మందిని విడిచిపెట్టనని వార్నింగ్ ఇస్తుంది. అన్నట్లుగానే అందులో ముగ్గుర్ని చంపేస్తుంది. ఓ చిన్నపాపను చంపటానికి సిద్ధమవుతుంది. విషయం తెలుసుకున్న రాఘవ్ ఆ దెయ్యానికి ఎదురెళతాడు? చివరకు తను పాపను బతికించుకున్నాడా? అసలు వేదవతికి, సువర్ణమాయకి ఉన్న సంబంధమేంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
సమీక్ష:
Kishkindhapuri Review: నటీనటుల విషయానికి వస్తే.. బెల్లంకొండ శ్రీనివాస్ పేరు చెబితేనే మనకు కమర్షియల్ సినిమాలే గుర్తుకు వస్తాయి. అందులో చాన్నాళ్ల నుంచి ఈ యంగ్ హీరో హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో రొటీన్‌కు భిన్నంగా తను హారర్ జోనర్‌ను సెలక్ట్ చేసుకోవటం కాస్త రిలీఫ్ నిచ్చిందనే చెప్పాలి. దీంతో తన మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్‌ను ఎక్కడా మిస్ కాకుండా కథలో భాగంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. యాక్టర్‌గా యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి నటనను కూడా కనపరిచాడు సాయిశ్రీనివాస్. మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ అందంగా కనిపించింది. ఇక ఆమె ద్వితీయార్ధంలో దెయ్యంగా మారే ఎపిసోడ్ భయపెడుతుంది. విశ్రవపుత్ర పాత్రలో నృత్య దర్శకుడు శాండీ మాస్టర్ చాలా బాగా నటించారు. ఆయన ప్రథమార్ధంలో కనిపించిన విధానమే భయపెడుతుంది. సినిమా ఫస్ట్ పార్ట్‌లో కనిపించిన హైపర్ ఆది, సుదర్శన్ కామెడీ పెద్దగా నవ్వించదు. నటి ప్రేమ తనదైన పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నారు. క్లైమాక్స్‌లో ఆమె పాత్ర మంచి టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. తనికెళ్ల భరణి తనదైన పంథాలో పాత్రకు ప్రాణం పోశారు. మిగిలిన నటీనటులందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికంగా చూస్తే.. హారర్‌తో పాటు థ్రిల్లింగ్ అంశాలతో సినిమా రూపొందింది. ప్రథమార్ధంలో దెయ్యాన్ని చూపిస్తూ భయపెట్టేందుకు, ద్వితీయార్ధంలో ఆ దెయ్యం వెనకున్న కథని చెప్పారు. భయపెట్టడం వరకూ ఫర్వాలేదనిపిస్తుంది కానీ సెకండాఫ్‌లో థ్రిల్లింగ్ వర్కవుట్ అవుతుందనుకుంటే అది ఆడియెన్స్‌కు పెద్దగా కనెక్ట్ కాలేదనే చెప్పాలి. కథలో చోటు చేసుకునే ట్విస్టులు ఆసక్తికరంగా ఉన్నాయి. లాజిక్‌ని పక్కనపెట్టి భయపెట్టే ప్రయత్నం కనిపిస్తుంది. ఫస్ట్‌హాఫ్‌లో హారర్, సౌండ్, విజువల్స్, కంటెంట్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యాయి. సువర్ణమాయ రేడియో స్టేషన్‌లోకి అడుగుపెట్టాకే అసలు కథ మొదలవుతుంది, అక్కడ వేదవతి వాయిస్ వినిపించడంతో కథలో హారర్ కోణం వెలుగులోకి వస్తుంది. కథానాయకుడు మిగిలినవాళ్ల ప్రాణాల్ని కాపాడుతూనే.. సువర్ణమాయ కథ తెలుసుకునేందుకు ప్రయత్నించటం.. ఫ్లాష్‌బ్యాక్‌గా వచ్చే సువర్ణమాయ స్టేషన్, వేదవతి, విశ్రవ పుత్ర కథలు సినిమాకి కీలకం. ఫ్లాష్‌బ్యాక్ రివీల్ అయిన తర్వాత కథ ఎలా సాగుతుందో ఓ అంచనాకి వచ్చేసినా.. కొన్నిచోట్ల దర్శకుడు అనూహ్యమైన మలుపులతో కథని ఆసక్తికరంగా మార్చాడు. కథానాయిక అనుపమ నేపథ్యంలో వచ్చే ట్విస్ట్, ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు బావున్నాయి. రామాయణం స్ఫూర్తితో పాత్రలకి పేర్లు పెట్టినా ఆ స్ఫూర్తి సినిమాపై పెద్దగా ప్రభావం చూపించలేదు. మొత్తంగా, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ని ఓ హారర్ కథలో చూడటం కొత్తగా అనిపిస్తుంది.
Also Read- Ananya Panday: ఎద అందాలతో యూత్ ను కవ్విస్తున్న లైగర్ బ్యూటీ
సామ్ సీఎస్ నేపథ్య సంగీతం చిత్రానికి హైలైట్‌గా నిలిచింది. చేతన్ భరద్వాజ్ స్వరపరిచిన అమ్మ పాట బాగుంది. చిన్మయ్ సలాస్కర్ సినిమాటోగ్రఫీ, విజువల్స్ మెప్పిస్తాయి. నిరంజన్ దేవరమనే ఎడిటింగ్ పదునుగా ఉండటం కలిసొచ్చింది. ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. దర్శకుడు కౌశిక్ ఓ కొత్త నేపథ్యంలోనే కథని రాసుకున్నాడు, అయితే కథనం విషయంలో ఇంకొన్ని కసరత్తులు చేయాల్సింది.
చివరగా.. కిష్కింధపురి.. బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త ప్రయత్నం
రేటింగ్ : 2.75/5


