హిందూపూర్ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ(Balakrishna)నేడు 66వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు బాలయ్యకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu)బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ‘తెలుగు సినీ నటులు, హిందూపురం శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణకి జన్మదిన శుభాకాంక్షలు. వెండి తెర కథానాయకునిగా కోట్లాది అభిమానులను పొందిన మీరు.. నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నారు.
ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan kalyan) బాలకృష్ణకు బర్త్ డే విషెస్ తెలిపారు. శతాథిక చిత్రాల కథానాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్చేశారు. ‘చారిత్రక, పౌరాణిక, జానపద పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించిన కథానాయకుడు ఆయన అంటూ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ప్రజా జీవితంలో హిందూపురం ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలు, సుఖ శాంతులతో ఉండాలి’ అని ఆకాంక్షించారు.
తన మామ బాలకృష్ణకు మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. “సిల్వర్ స్క్రీన్ పై ఆయన లెజెండ్.. పొలిటికల్ స్క్రీన్ పై ఆయన అన్ స్టాపబుల్.. ప్రజల గుండెల్లో ఆయన బాలయ్య.. నా ముద్దుల మావయ్య పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అని లోకేశ్ ట్వీట్ చేశారు.
అలాగే బాలయ్య సోదరి, ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari.)బాలయ్యకు శుభాకాంక్షలు చెబుతూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. “నాన్నగారి నట వారసత్వంతో పాటు మంచి మనస్సు, కాస్త చిలిపితనం, ఎంతో క్రమశిక్షణ, దైవ భక్తి కలగలిసిన, మనందరి అభిమాన నటుడు, మా బాల అన్నయ్యకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అని రాసుకొచ్చారు.
కాగా బాలయ్య ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో అఖండ 2(Akhand 2) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పుట్టినరోజు సందర్భంగా సోమవారం సాయంత్రం విడుదలైన మూవీ టీజర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది.
Balakrishna: బాలకృష్ణకు ప్రముఖుల పుట్టినరోజు శుభాకాంక్షలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES