మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కుటుంబసభ్యులు తల్లి అంజనమ్మను స్పెషల్ ఇంటర్వ్యూ(Mega Women Interview) చేశారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో విడుదలైంది. ఇందులో చిరంజీవి, నాగబాబు, వారి సోదరీమణులు ఉన్నారు. ఈ సందర్భంగా తమ తల్లితో చిన్నప్పుడు ఉన్న జ్ఞాపకాలు పంచుకున్నారు. కష్ట సమయాల్లో అంజనమ్మ ఎలా సపోర్ట్‌గా నిలిచిందో చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. అయితే అంజనమ్మకు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, మాధవి, విజయదుర్గ సంతానం అని అందరికి తెలిసిందే. కానీ మరో ముగ్గురు తోబట్టువులు చిన్నప్పుడే చనిపోయిన సంగతి చెబుతూ మెగాస్టార్ ఎమోషనల్ అయ్యారు.
“మా అమ్మకు అయిదుగురు ఉన్నాం. కానీ పురిట్లో ఒకరు, ఒక సంవత్సరం, రెండేళ్లు పెరిగి ఇద్దరు చనిపోయారు. నాకు ఆరేళ్ళు ఉన్నప్పుడు రమా అనే రెండేళ్ల మా చెల్లి చనిపోయింది. బ్రెయిన్ ఫ్లూ వస్తే పొన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాం. కొన్ని రోజులకు చనిపోయింది. మా నాన్న పోలీస్ కావడంతో క్యాంప్‌లకువెళ్లేవారు. తను చనిపోయినప్పుడు మా నాన్న క్యాంప్‌లోనే ఉన్నారు. అమ్మ ఆ శవాన్ని ఎత్తుకొని రిక్షాలో ఇంటికి తీసుకురావడం నాకు ఇప్పటికి గుర్తు ఉంది. నాన్న లేరు. ఏం చేయాలో, ఆయనకు ఎలా ఈ విషయం తెలియజేయాలో తెలీదు. అలాంటి పరిస్థితుల్లో చుట్టూ ఉండే పక్కవాళ్ళు అన్ని కార్యక్రమాలు నిర్వహించారు. డిపార్ట్మెంట్ వాళ్ళను పట్టుకొని నాన్నకు ఇన్ఫర్మేషన్ ఎలాగోలా తెలియచేసాము. కానీ నాన్న వచ్చేసరికి అన్ని కార్యక్రమాలు అయిపోయాయి” అంటూ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.