Harassment In Entertainment Industry: రంగుల ప్రపంచంగా కనిపించే సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులనే చీకటి కోణాలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా, దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న “తారక్ మెహతా కా ఉల్టా చష్మా” సీరియల్ నటి ఒకరు, అదే సీరియల్ నిర్మాతపై చేసిన సంచలన ఆరోపణలు పరిశ్రమను కుదిపేస్తున్నాయి. తనను లైంగికంగా వేధించాడంటూ ఆమె ధైర్యంగా ముందుకు రావడం తీవ్ర చర్చకు దారితీసింది.
“తారక్ మెహతా కా ఉల్టా చష్మా” సీరియల్‌లో ‘రోషన్ సోధీ’ పాత్రతో ప్రతి ఇంటికి దగ్గరైన నటి జెన్నీఫర్ మిస్త్రీ బన్సివాల్, ఆ షో నిర్మాత అసిత్ కుమార్ మోదీ తనను లైంగికంగా వేధించాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. గతంలోనే ఈ విషయంపై మాట్లాడినప్పటికీ, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మరిన్ని దిగ్భ్రాంతికరమైన విషయాలను బయటపెట్టింది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/mega-fans-troll-on-chiranjeevi-daughter-sushmita-konidela/
2018లో జరిగిన ఒక సంఘటనను జెన్నీఫర్ గుర్తుచేసుకుంది. షో ఆపరేషన్స్ హెడ్ సోహైల్ రమణిపై ఫిర్యాదు చేసేందుకు నిర్మాత అసిత్ మోదీ వద్దకు వెళ్లగా, ఆయన ఆ ఫిర్యాదును పెడచెవిన పెట్టడమే కాకుండా, తన శరీరాన్ని ఉద్దేశించి అసభ్యకరంగా వ్యాఖ్యానించాడని ఆమె ఆరోపించింది. ఇది తనను తీవ్రంగా బాధించిందని తెలిపింది.
అంతటితో ఆగకుండా, 2019లో షో చిత్రీకరణ కోసం సింగపూర్ వెళ్లినప్పుడు అసిత్ మోదీ హద్దులు మీరి ప్రవర్తించాడని జెన్నీఫర్ కన్నీటిపర్యంతమైంది. అందరూ ఉన్నప్పుడే ఒక కాఫీ షాపులో తనను పక్కకు పిలిచి, “నీ పెదాలు చాలా బాగున్నాయి, వాటిని చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది” అంటూ అత్యంత అనుచితంగా మాట్లాడాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ మాటలు తనను మానసికంగా కుంగదీశాయని, ఆ షాక్ నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టిందని ఆమె చెప్పింది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/pragya-jaiswal-will-she-score-a-hat-trick-with-balakrishna-after-nayanathara/
ఈ వరుస సంఘటనలతో మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైన జెన్నీఫర్, చివరికి 2023లో ఆ షో నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు వివరించింది. కేవలం అవకాశాల కోసం ఎంతోమంది అమ్మాయిలు ఇలాంటి వేధింపులకు గురవుతున్నారని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొందరు ఇలాంటి నీచమైన పనులకు పాల్పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. జెన్నీఫర్ ధైర్యంగా ముందుకు వచ్చి చేసిన ఈ ఆరోపణలతో పరిశ్రమలో మహిళల భద్రతపై మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఆమె న్యాయపోరాటానికి పలువురు మద్దతు ప్రకటిస్తున్నారు.


