Darshan: శాండిల్ వుడ్‌కి చెందిన స్టార్ దర్శన్ ప్రస్తుతం రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే జైలులోని దారుణమైన పరిస్థితులు తనను ఎంతగానో కలచివేస్తున్నాయి. జైల్లో సిట్యువేషన్స్‌ను భరించలేకపోతున్నానని ఆయన కోర్టు ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.
దర్శన్ ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిటీ సివిల్, సెషన్స్ కోర్టు ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జైలు అధికారుల పనితీరుపై జైలులో ఉన్న సౌకర్యాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. ‘‘నేను చాలా రోజులుగా సూర్యరశ్మి చూడలేదు. నేను ఉంటున్న గదిలో దుర్వాసన తీవ్రంగా వస్తోంది. అంతేకాకుండా, ఫంగస్ తీవ్రత చాలా భయపెడుతోంది. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జీవించడం నాకు అత్యంత దుర్భరంగా ఉంది. దయచేసి నాకు విషమివ్వండి’’ అని దర్శన్ న్యాయమూర్తి ముందు వాపోయినట్లు సమాచారం.
Also Read – SYG – Sambarala Yeti Gattu: గాసిప్స్ సాయి దుర్గ తేజ్ చెక్.. ‘సంబరాల ఏటిగట్టు’ రీ స్టార్ట్ అయ్యేదెప్పుడంటే!
రేణుకాస్వామి హత్యకేసులో దర్శన్ అరెస్టు అయిన తర్వాత, గత ఏడాది డిసెంబర్‌లో కర్ణాటక హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. విచారించిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను పక్కనపెట్టి దర్శన్‌ను వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఒక కీలకమైన వ్యాఖ్య చేసింది. చట్టానికి ఎవరూ అతీతులు కారని, కస్టడీలో దర్శన్‌కు ఎలాంటి ప్రత్యేక వసతులు కల్పించాల్సిన అవసరం లేదని జైలు అధికారులను ఆదేశించింది. ఈ తీర్పు తర్వాత దర్శన్ తిరిగి కస్టడీలోకి వచ్చారు.
ప్రస్తుతం జైలులో దర్శన్ ఎదుర్కొంటున్న ఇక్కట్లతో ఆయన చేసిన ‘నాకు విషమివ్వండి’ అనే అభ్యర్థన జైలు పరిస్థితులపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఒక ప్రముఖ నటుడు ఇలాంటి విన్నపం చేయడం ఈ పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ కేసు విచారణ మరియు జైలు పరిస్థితులపై తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
Also Read – OG Pre Release Event: మెగా పవర్ ఫీస్ట్.. తమ్ముడి కోసం చిరు గెస్ట్.. ఫ్యాన్స్‌కి ట్రీట్


